
కన్నడ మూవీ కాంతారా అనూహ్య విజయం సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబలే సంస్థ నిర్మించింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత నెలలో విడుదలైన ఈ మూవీ అన్ని పరిశ్రమలను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్‌లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం వసూళ్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను వసూలు చేసిందని తెలుస్తోంది. టాలీవుడ్‌లో కొత్త సినిమాలను కూడా కాంతార తలదన్నింది. దీపావళికి విడుదలైన అన్ని సినిమాలు కాంతార ముందు వెలవెలబోయాయి. ముఖ్యంగా కార్తీ సర్ధార్, విశ్వక్ సేన్ ఓరిదేవుడా మూవీలకు మంచి టాక్ వచ్చినా ఈ సినిమాలను మించి కాంతార వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
మరోవైపు ఏపీ, తెలంగాణలో కాంతార మూవీకి అనూహ్యంగా థియేటర్ల కౌంట్ పెరుగుతోంది. తొలి వారం 305 థియేటర్లు, రెండో వారం 220 థియేటర్లు మాత్రమే ఈ మూవీకి అందుబాటులో ఉన్నాయి. కానీ మూడో వారం 555 థియేటర్లకు పైగా కాంతార మూవీ ప్రదర్శింపబడుతోంది. నైజాంలో 223 థియేటర్లు, సీడెడ్‌లో 105 థియేటర్లు, ఆంధ్రాలో 225 థియేటర్లలో కాంతారను ప్రదర్శిస్తున్నారు. మూడో వారం కూడా ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రెండు వారాల్లో రూ.31కోట్లకు పైగా గ్రాస్, రూ.17 కోట్లకు పైగా షేర్ సాధించింది. రెండు వారాల వసూళ్లను పరిశీలిస్తే నైజాంలో రూ.7.77 కోట్లు, సీడెడ్‌లో రూ.2.15కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.25 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.1.37 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.89 లక్షలు, గుంటూరులో రూ.1.15కోట్లు, కృష్ణాలో రూ.1.15 కోట్లు, నెల్లూరులో రూ.70 లక్షలు వసూలు చేసింది. ఈ మూవీకి డైరెక్టర్ కమ్ హీరో రిషబ్‌శెట్టి బ్యాక్ బోన్‌గా నిలిచాడు. 2010లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిషబ్ శెట్టికి ఇన్నాళ్లుగా పెద్దగా పేరు రాలేదు. కానీ కాంతార మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు.
కాగా కాంతార మూవీ కేజీఎఫ్-2 రికార్డులను కూడా బీట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన చిత్రాల్లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా కాంతార నిలిచింది. యష్ నటించిన కేజీఎఫ్-2 సినిమా టికెట్లు 75 లక్షలు అమ్ముడవగా.. కాంతార టికెట్లు ఇప్పటివరకు 77 లక్షలు విక్రయమయ్యాయి. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేయగా మంచి లాభాలను అందించింది. కాంతార డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిక్కుల్లో పడింది. ముఖ్యంగా వరాహ రూపం పాట బాణీ కాపీ అని విమర్శలు వచ్చాయి. తమ నవసర మూవీకి కాపీ అని ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అంతే కాకుండా కోర్టులో కేసు కూడా వేసింది. దీంతో కేరళలోని థియేటర్లలో, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో వరాహ రూపం పాటను ప్లే చేయకూడదని కేరళ కోజికోడ్ సెషన్స్ కోర్టు కాంతార చిత్ర దర్శక నిర్మాతలను ఆదేశించింది.