
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ద్వారా అటు మెగా అభిమానులను, ఇటు నందమూరి అభిమానులను జక్కన్న ఆనందానికి గురిచేశాడు. నాలుగేళ్లుగా ఎదురుచూసిన అభిమానులకు కానుకగా ఈ సినిమా ఫలితాన్ని అందించాడు. బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తాను ఈ సినిమా మరోసారి చాటిచెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1130 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అమెరికాలో అత్యధిక కాలం నడిచిన సినిమాగా ఆర్.ఆర్.ఆర్ రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా అమెరికాలో రీ రిలీజ్ అయ్యింది. రీ రిలీజ్‌లోనూ ఈ సినిమా పిచ్చ క్రేజ్‌ను సంపాదించుకోవడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది.
అమెరికాలో రీ రిలీజ్‌లోనూ ఆర్.ఆర్.ఆర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లను రాబట్టింది. రీ రిలీజ్‌లో ఈ మూవీ అమెరికాలో 150 లొకేషన్‌లలో 100 విభిన్న స్క్రీన్‌లలో విడుదల కాగా దాదాపు 300K డాలర్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల కట్ చేసిన సన్నివేశాలన్నీ ఈ అన్ కట్ వెర్షన్‌లో పొందుపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికాలో భారీ స్థాయిలో రీ రిలీజ్‌లోనూ ఈ మూవీ క్రేజ్ సంపాదించుకోవడంతో త్వరలో ఇతర దేశాల్లోనూ మరోసారి విడుదల చేయాలని జక్కన్న టీమ్ రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు చైనీస్, జపనీస్ వంటి భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేసి మరిన్ని వసూళ్లు కొల్లగొట్టాలని ఆర్.ఆర్.ఆర్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. టాలీవుడ్‌లో ఇద్దరు అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో చూపిస్తూ ఓ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో జక్కన్న ఆర్.ఆర్.ఆర్ మూవీని తెరకెక్కించాడు.
కాగా ఈ మూవీ ఓటీటీలోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చి తన సత్తా చాటుతున్న విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాల్లో ఈ మల్టీస్టారర్ మూవీ టాప్ 10లో కొనసాగుతోంది. ఇక నెట్ ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో ఈ మూవీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వీఎఫ్‌ఎక్స్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా కోసం యూనిట్ ఎంత కష్టపడిందన్న విషయాన్ని వీడియోలో పొందుపరిచారు. ముఖ్యంగా రామ్‌చరణ్ ఎంట్రీ సన్నివేశాన్ని 32 రోజుల పాటు చిత్రీకరించినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ యాక్షన్ సన్నివేశాన్ని థియేటర్స్‌లో చూసిన జనాలకు గూజ్ బంప్స్ వచ్చాయి. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ సినిమా కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్‌తో రాజమౌళి తన తదుపరి మూవీని చేస్తున్నాడు. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా అధికారికంగా అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.