
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రీ రిలీజ్‌లోనూ దుమ్మురేపుతోంది. 2001లో ఎన్ని రికార్డులు సాధించిందో 22 ఏళ్ల తర్వాత కూడా అదే రీతిలో వసూళ్లను సాధించడం విశేషం. ఈ సినిమాకు పవన్ అభిమానులు మరోసారి బ్రహ్మరథం పట్టారు. రీరిలీజ్ అయిన థియేటర్లలో ఖుషి రికార్డులు బద్దలు కొట్టింది. ముందుగా న్యూ ఇయర్ సందర్భంగా ఒక్క రోజే ఖుషి సినిమాను ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ సినిమాను మరికొన్ని రోజులు పొడిగించారు . ఈ క్రమంలోనే చూస్తుండగానే వారం రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది. తొలి వారం ఈ సినిమా అనూహ్య రీతిలో రూ.7.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో తొలిరోజు రూ.3.62 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ రెండో రోజు రూ.1.52 కోట్లు, మూడో రోజు రూ.54 లక్షలు, నాలుగో రోజు రూ.21 లక్షలను వసూలు చేసింది. అలాగే మిగతా రోజుల్లోనూ రూ.10 లక్షల కంటే ఎక్కువ గ్రాస్‌ను వసూలు చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాను న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న రీ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా కూడా రూ. 3.5 కోట్లు కలెక్ట్ చేయలేదు. మూడు కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది. అదీ కూడా పవన్ కళ్యాణ్ మూవీనే కావడం విశేషం. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 1న జల్సా మూవీని రీ రిలీజ్ చేశారు. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.2 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఖుషి సినిమా ఫస్ట్ డే కలెక్షన్లతోనే ఆ రికార్డును బీట్ చేసింది. ఏపీలోని కొన్ని ఏరియాల్లో లా అండ్ ఆర్డర్ సమస్యల పేరుతో ఖుషి మూవీని రీ రిలీజ్ చేయడానికి అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ అనుమతులు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసేదని పవర్‌స్టార్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా ఖుషి సినిమాను థియేటర్‌కు వెళ్లి చూశాడు. అతడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి థియేటర్‌కు వెళ్ళాడు. అయితే ఎటువంటి హంగామా లేకుండా ముఖానికి మాస్క్, ఒక హుడీ టీ షర్ట్ వేసుకుని వెళ్ళాడు.
కాగా ఖుషి సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారం చేస్తే మంచి టీఆర్పీ రేటింగులను నమోదు చేస్తుంది. ఈ సినిమా రీ రిలీజ్ అయిన రోజే స్టార్ మాటీవీ వారు టీవీలో ప్రసారం చేశారు. అయినా అభిమానులు ఇదేమీ లెక్కచేయకుండా థియేటర్‌కు వెళ్లి మరీ వీక్షించారు. ఇప్పటికే కొన్ని వందల సార్లు యూట్యూబ్, టీవీల్లో ఈ సినిమాను పవన్ ఫ్యాన్స్ చూసి ఉంటారు. కానీ థియేటర్లలో చూస్తే ఫీలింగ్ వేరుగా ఉంటుందని అభిప్రాయపడుతూ థియేటర్లకు క్యూ కట్టారు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఏ.ఎమ్.రత్నం నిర్మించిన ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన భూమిక నటించింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యూత్‌కు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా సిద్దు సిద్ధార్ధ రాయ్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు అప్పటి యూత్‌కు కనెక్ట్ అయ్యాయి. మణిశర్మ అందించిన సంగీతం ఖుషి సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అప్పట్లో ఖుషి పాటలు యువతను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఖుషి పాటలను చాలా మంది ప్లే చేస్తూ కనిపిస్తుంటారు. మణిశర్మ పాటలు, ఆ మ్యూజిక్, వింటేజ్ పవన్ కల్యాణ్ లుక్స్, భూమిక యాక్టింగ్, అలీ కామెడీ ఖుషి సినిమాను మళ్లీ మళ్లీ థియేటర్లలో చూసేందుకు ప్రేరేపిస్తున్నాయి.