
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్‌గా మారిపోయాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత చెర్రీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో అతడు తదుపరి నటించే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ నటించిన ఆచార్య మూవీ విడుదలైనా అది ఆర్.ఆర్.ఆర్ విడుదల కాకముందు ఆ సినిమా షూటింగ్ జరిగింది. అయితే ఆర్.ఆర్.ఆర్ విడుదలైన తర్వాత చరణ్ ప్రఖ్యాత దర్శకుడు శంకర్ మూవీలో నటిస్తున్నాడు. శంకర్ మూవీ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాయింట్‌నైనా ప్రేక్షకులకు అర్ధమయ్యేలా తీయడం శంకర్ స్పెషాలిటీ. జెంటిల్మెన్, జీన్స్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో, శివాజీ ఇలా ఏ సినిమాను తీసుకున్నా శంకర్ ప్రత్యేకత కనిపిస్తుంది. అలాంటి దర్శకుడు రామ్‌చరణ్‌తో సినిమా తీస్తున్నాడంటే ఏ పాయింట్‌తో తీస్తున్నాడనే విషయం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా కారణంగా శంకర్, చరణ్ మూవీ షూటింగ్ ఆగుతూ సాగుతూ నడుస్తోంది. అయితే ఈ సినిమా కథ పొలిటికల్ నేపథ్యంలో సాగుతుందని ప్రచారం నడుస్తోంది. ప్రజెంట్ మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్‌కు పొలిటికల్ పార్టీ ఉంది. ఆయన జనసేన పార్టీ చీఫ్‌గా ఉన్నాడు. తొలి నుంచి జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. గత ఎన్నికల్లో జనసేన కోసం పెద్దగా మెగా ఫ్యామిలీ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే వచ్చే ఎన్నికల్లో వస్తారని టాక్ నడుస్తోంది. ఆయనకు మద్దతుగానే చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాజమహేంద్రవరం నేపథ్యంలో సినిమా ఉంటుందని, సినిమా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అక్కడే ఉంటాయని ఇప్పటికే లీకుల ద్వారా బయటకు పొక్కింది. ఆ సీన్స్‌లో పొలిటికల్ టచ్ బలంగా ఉంటుందని సమాచారం. శంకర్ మూవీలో రామ్‌చరణ్ ఓ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తాడని.. ఈ మేరకు ఇప్పటికే పార్టీ గుర్తులు, పేరు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాలో ఆ పార్టీ నినాదం కూడా బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే.. ఈ సినిమా చరణ్‌కు, పవన్‌కు బాగా కలిసొచ్చేలా డిజైన్ చేశారని అందరూ భావిస్తున్నారు.
శంకర్-రామ్‌చరణ్ సినిమా పోస్టర్లు చూస్తే.. జనసేన పార్టీ గుర్తులు, పేర్లకు దగ్గర పేర్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. సింబల్‌గా టీమ్ రెండు పిడికిళ్లు కలిసిన చేతుల గుర్తు వాడారు. నిజ రాజకీయంలో చూస్తే.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనాల్లోకి బలంగా వెళ్లింది అంటే అది పిడికిలి గుర్తుతోనే. చెయ్యెత్తి బలంగా పిడికిలి చూపించే పవన్ ఫొటోలు సోషల్ మీడియాలో ముఖ్యంగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల ట్విటర్ హ్యాండిల్స్ కనిపిస్తాయి. అటు మనం ఓటు అమ్ముకుంటే మన పిల్లల భవిష్యత్తును కూడా అమ్ముకున్నట్లే అనే పాయింట్‌తో దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో ఉన్న సినిమాలను శంకర్ బాగా తెరకెక్కిస్తాడనే పేరు ఉంది. దీంతో రామ్‌చరణ్ మూవీ కూడా అందరూ మెచ్చే రీతిలో ఉండనుంది. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరుపై దిల్ రాజు భారీఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జే.సూర్యతో పాటు సునీల్, శ్రీకాంత్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.