
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా ద్వారా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ విశ్వవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ అదరగొట్టాడు. క్లైమాక్స్ ఫైట్‌లో సీతారామరాజు వేషంలో కనిపించి వావ్ అనిపించాడు. ఈ పాత్రకు త్వరలో ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా రాముడి పాత్రలో అదరగొట్టేశాడంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ సినిమాలతో తన ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను మాత్రమే చేస్తున్నాడు. ఈ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఇటీవల ఆదిపురుష్ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆకాశంలోకి విల్లు ఎక్కుపెడుతున్న ప్రభాస్ పోస్టర్ ఆకట్టుకుంది. అలాగే కోరమీసంతో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉంది. ట్రెడిషనల్ రాముడి గెటప్‌కు భిన్నంగా ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ ఉన్నాడు. పొడవాటి జుట్టు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా ప్రభాస్ ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి కూడా కారణమైంది. రాముడి గెటప్‌లో ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ కనిపించడంతో రామ్‌చరణ్ అభిమానులు కుళ్లుకుంటున్నారు. రాముని గెటప్‌లో మా హీరో తోపంటే మా హీరో తోపు అని ప్రభాస్, రామ్‌చరణ్ అభిమానులు విమర్శలు చేసుకుంటున్నారు. న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుందని ఇరు వర్గాలకు సర్ది చెబుతున్నారు. ఇలాంటి పోలికలు అనవసరం అంటున్నారు. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సంతృప్తిగా ఉన్నారు. అక్టోబర్ 2న ఆదిపురుష్ టీజర్ విడుదల కానుంది.
ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీస్థాయిలో విడుదల కానుంది. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన కృతిసనన్ జంటగా నటిస్తోంది. గతంలో మహేష్ సరసన నేనొక్కడినే సినిమాలో కృతిససన్ నటించింది. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో కృతి సనన్ జానకీ దేవిగా కనిపించనుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్‌ను ఆదిపురుష్ ద్వారా మేకర్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రభాస్ పాత్రకు రాముడి ఆహార్యం కోసం వినియోగించిన కాస్ట్యూమ్స్ ఆనాటి అలంకరణ ప్రతీది గెటప్‌ను మ్యాచ్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.