
టాలీవుడ్లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్ధలు అంటే దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, యువీక్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ అని చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటి వరకు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, డియర్ కామ్రేడ్, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట వంటి హిట్ చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ నుంచి వచ్చే సంక్రాంతికి రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలను మైత్రి సంస్థ నిర్మించడం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా సెట్స్ మీద ఈ సంస్ధ నిర్మాణంలో ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ సంస్థకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లోని మైత్రీ కార్యాలయాలపై దాడులు చేశారు.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థపై ఒక్కసారిగా ఐటీ రైడ్స్ టాలీవుడ్లో ప్రకంపనలు రేపాయి. సుమారు 10 మంది అధికారులు ఏకకాలంలో మైత్రీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ సినిమాలను ఈ సంస్థ నిర్మిస్తున్న నేపథ్యంలో ఆదాయ వ్యయాలపై ఐటీ శాఖ ఎక్కువగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మైత్రీ సంస్థ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థను యలిమంచిలి రవిశంకర్, ఎర్నేని నవీన్ నిర్వహిస్తున్నారు. దీంతో వీళ్ల ఇళ్లలోనూ అధికారులు సోదాలు జరిపారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. హై బడ్జెట్ సినిమాలకు నిర్మాణ వ్యయం, పెట్టుబడులు ఎలా సమకూర్చుతున్నారన్న అంశంపై నిర్మాతలను ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్, లాభాల గురించి కూడా సంస్థ అధికారులను ఆరా తీశారు.
కాగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో పాటు కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలకు ఈ సంస్థ వరుసగా అడ్వాన్స్ లు ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలను ఈ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలకు వందల కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా మైత్రీ మూవీస్ సబ్మిట్ చేసిన రిటర్న్స్‌ను ఐటీ అధికారులు పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది. అసలే ఇప్పుడు మైత్రీ వారు కొత్తగా డిస్ట్రిబ్యూషన్లోకి దిగారు. నైజాం మీద పట్టు సాధించేందుకు ఈ సంక్రాంతిని వాడుకుంటున్నారు. చిరంజీవి, బాలయ్య వంటి హీరోల సినిమాలను సొంతంగా రిలీజ్ చేసి భారీ లాభాలను గడించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ రైడ్స్ జరగడంతో ఈ సినిమాలు విడుదల అవుతాయా అన్న అంశం ఆసక్తి రేపుతోంది.