
క్షణం, గూఢచారి, ఎవరు లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో హీరో అడివి శేష్ తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చాటుకున్నాడు. అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించినా క్షణం సినిమా అడివి శేష్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకుంటూ అతడు ముందుకు సాగిపోతున్నాడు. అతడి సినిమా అంటే కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఆ నమ్మకంతోనే 26/11 ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ నటించిన మేజర్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం భారీ స్థాయిలో రిలీజైంది. విడుదలకు ముందు పది రోజుల నుంచే మెట్రో సిటీలలో ఈ మూవీ ప్రీమియర్ షోలను ప్రదర్శించగా మంచి స్పందన లభించింది.
దేశవ్యాప్తంగా మేజర్ సినిమాను 88 ప్రీమియర్ షోలు వేయగా అన్ని షోలు హౌస్‌ఫుల్స్ కావడం విశేషం. హైదరాబాద్ సిటీలోనూ రిలీజ్ రోజుకు ముందు పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించగా మంచి రెస్సాన్స్ లభించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే కేవలం ఇది ముంబై దాడుల మీద తీసిన సినిమా కాదు. సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్. దీంతో బాల్యం నుంచి ముంబై ఎటాక్స్ ముందు వరకు సందీప్ జీవితాన్ని ఫాస్ట్ ఫార్వార్డ్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ఇండియాలో బెస్ట్ బయోపిక్స్ జాబితా తీస్తే అందులో మేజర్ మూవీకి కూడా కచ్చితంగా స్థానం దక్కేలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని దర్శకుడు శశికిరణ్ తిక్కా అత్యుత్తమ స్థాయిలో వెండితెరపై ప్రెజెంట్ చేశాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంట్లతో గౌరవప్రదమైన స్థానాన్ని నిలుపుకుంటున్న అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రానికి మహేష్ బాబు కూడా నిర్మాణంలో భాగస్వామి కావడం క్లాస్‌కు మాస్ టచ్ ఇచ్చినట్లు అయ్యింది.
ఎన్నో అంచనాలతో వచ్చిన మేజర్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ బిగ్ అసెట్‌గా మారింది. దీంతో తొలిరోజు ఏపీ, తెలంగాణలో కలిపి ఈ మూవీ రూ.5 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. అడివి శేష్ సినిమాల్లో ఈ కలెక్షన్‌లు ఎక్కువ అనే చెప్పాలి. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మించాయి. అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని దేశభక్తి చిత్రం అనడం కంటే ఒక నిఖార్సైన సైనికుడు మొండితనాన్ని అద్దం పట్టే చిత్రం అని చెప్పుకోవచ్చు. మరోవైపు మేజర్ సినిమా ఓటీటీ అప్‌డేట్ కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘మేజర్’ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు నెలల తరువాతే ఓటీటీలో విడుదలవుతుందని తెలుస్తోంది. దీన్ని బట్టి ఆగస్టు మొదటి వారంలో మేజర్ మూవీ ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.