
టాలీవుడ్‌లో వచ్చేవారం రెండు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాతో పాటు అక్కినేని నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు కర్నూలులో ది ఘోస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్ గెస్టులుగా హాజరయ్యారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి గరుడ వేగ ఫేం దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ 33 ఏళ్ల కిందట శివ సినిమా విడుదలైన తేదీ అక్టోబర్ 5నే ఇప్పుడు ఘోస్ట్ సినిమా విడుదలవుతుందని చెప్పాడు. అప్పుడు చైన్ పట్టుకుని ప్రేక్షకుల ముందుకు వస్తే.. ఇప్పుడు కత్తి పట్టుకుని వస్తున్నానని ఛమత్కరించాడు. అటు తన సినిమా విడుదలవుతున్న రోజే తనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతోందని.. ఈ సినిమా కూడా భారీ సక్సెస్ కావాలని ఘోస్ట్ ప్రీ రాలీజ్ ఈవెంట్ వేదికగా నాగార్జున విషెస్ తెలిపాడు. తాను కావాలని చిరంజీవి గారికి పోటీ రావడం లేదని.. టీం తీసుకున్న నిర్ణయం వల్లే అదే రోజు రావాల్సి వస్తోందని.. మెగా అభిమానులు ఈ విషయంలో తనను క్షమించాలని నాగార్జున కోరాడు.
మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుతో తన సినిమా గురించి నాగార్జున ఓపెన్ అయ్యాడు. గతంలోది ఘోస్ట్ టీజర్‌ను మహేష్ బాబు రిలీజ్ చేసిన సమయంలో నాగ్, మహేష్‌కు థాంక్స్ చెప్తూ.. మీ నాన్న నేను వారసుడు సినిమా చేశాం.. ఆ సర్కిల్‌ను మనం ముగిద్దాం అని చెప్పుకు వచ్చాడు. అందుకు మహేష్ సైతం తప్పకుండా చేద్దాం అని చెప్పడంతో మహేష్- నాగ్ మధ్య మల్టీస్టారర్ ఉంటుందని అభిమానులు ఎంతో ఆనందించారు. తాజాగా ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరోసారి నాగ్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. అభిమానులు మహేష్‌తో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు.. అందుకు మీ సమాధానం ఏంటి అని అడుగగా.. మహేష్ ఎప్పుడు ఒకే అంటే అప్పుడే అని చెప్పి నాగార్జున షాకిచ్చాడు. అంటే కథకు మహేష్ ఒకే చెప్పాలే కానీ నాగ్ ఎప్పుడు ముందే ఉన్నాడని అర్ధమవుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అక్కినేని, ఘట్టమనేని అభిమానులు మహేష్ త్వరగా ఓకే చెప్పు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి యాక్షన్ హీరోలుగా ఆ కథ చేయండి.. ఈ కథ చేయండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.
అటు ఘోస్ట్ చిత్రంలో అనీఖా సురేంద్రన్, గుల్ పనాగ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో కలిసి ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు నాగార్జున భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఘోస్ట్ సినిమాకు నాగార్జున రూ. 6 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ప్రాఫిట్స్‌లో షేర్ కూడా తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. గరుడ వేగ హిట్ చిత్రం తర్వాత ప్రవీణ్ సత్తారు, బంగార్రాజు వంటి సూపర్ సక్సెస్ తర్వాత నాగార్జున కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు. గతేడాది వైల్డ్ డాగ్ సినిమాతో పలకరించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి నాగార్జున తన తనయుడు బంగార్రాజు సినిమాతో పలకరించారు. ఈ సినిమా కూడా అంతంత మాత్రంగా వసూళ్లు రాబట్టింది. ఘోస్ట్ సినిమాలో రా ఏజెంట్ పాత్రలో చేసిన నాగార్జున చేసిన స్టంట్స్ హైలెట్ అని సినిమా యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.