
ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న మరో మూవీ గాడ్ ఫాదర్. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. మలయాళంలో వచ్చిన లూసీఫర్ సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మోహన్‌రాజా ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. అయితే మరో రెండు వారాల్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్‌ల విషయంలో అంతంత మాత్రంగానే ఉంది. ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా పట్ల అంతగా బజ్ కనిపించడం లేదు. దీంతో అందరూ అయోమయానికి గురవుతున్నారు. ఆచార్య తర్వాత చిరుకు తప్పనిసరిగా హిట్ అవసరమైన నేపథ్యంలో గాడ్ ఫాదర్ మూవీ విషయంలో లో ప్రొఫైల్ ఎందుకు మెయింటెన్ చేస్తున్నారంటూ మెగా అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే ఈ మూవీ పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారని ప్రస్తుతం ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అందుకే ఆయన ప్రమోషన్‌లను లైట్ తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్, థార్ మార్ సాంగ్ అంతగా ఆకట్టుకునేలా లేవు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నా గాడ్ ఫాదర్ సినిమా పట్ల హైప్ రావడం లేదు. దీంతో సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ చేశారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని, తాన్యా రవిచంద్రన్, పూరి జగన్నాథ్ ఇతర పాత్రలు పోషిస్తుండగా తమన్ సంగీతం అందించాడు. అయితే తొలుత ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళం, హిందీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నందున పంపిణీదారులు, ప్రదర్శనదారులు గాడ్ ఫాదర్ మూవీని హిందీలో కూడా విడుదల చేయాలని చిరును కోరారట. అయితే చిరంజీవి అంగీకరించలేదని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన తర్వాత ఆలోచిద్దామని చెప్పినట్లు వినికిడి. ఎందుకంటే ఈ మూవీ పట్ల చిరుకు నమ్మకం లేదని.. బాలీవుడ్‌లో విడుదల చేస్తే పరువు పోతుందని ఆయన ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు చిరంజీవి గాడ్‌ఫాదర్ రిలీజ్ రోజునే నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ కూడా విడుదల కానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, రవివర్మ, జయప్రకాశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జున ద ఘోస్ట్ మూవీలో యాక్షన్ కంటెంట్ బాగా ఉండటంతో ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గోల్డ్ మైన్స్ ఫిల్మ్స్ హిందీ విడుదల కోసం సంప్రదించగా నాగార్జున ఓకే చెప్పాడట. అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ హిందీ వెర్షన్ పంపిణీదారులు నాగార్జున ది ఘోస్ట్ చిత్రాన్ని బాలీవుడ్‌లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమాతో నాగార్జున మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో ది ఘోస్ట్ కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని నాగ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. అటు చిరంజీవి ఎలాంటి కథానాయిక లేకుండా గాడ్ ఫాదర్ మూవీలో సోలోగా నటించారు. ఉప్పు లేని పప్పు మసాలా లేని కూరల ఉన్న ఈ సినిమా కోసం ఓ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశారట. ఈ ఐటెం సాంగ్‌ను నోరా ఫతేహి లేదా డింపుల్ హయతితో చేయించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.