
బిగ్‌బాస్-6తో క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్లలో శ్రీహాన్ ఒకడు. అంతేకాకుండా విన్నర్ రేవంత్‌కు గట్టిపోటీ కూడా ఇచ్చాడు. ఒకవేళ మనీ ఆఫర్ అంగీకరించకపోయి ఉంటే శ్రీహాన్ బిగ్‌బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉండేవి. ఏదేమైనా బిగ్‌బాస్-6 సీజన్ ముగిసింది. విన్నర్‌గా రేవంత్ నిలవగా రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచాడు. విజేతగా నిలిచిన రేవంత్ కంటే శ్రీహాన్ ఎక్కువ అమౌంట్‌ను గెలుచుకున్నాడు. రేవంత్ రూ.10 లక్షలు మాత్రమే గెలుచుకోగా శ్రీహాన్ ఏకంగా రూ.40 లక్షల నగదును సొంతం చేసుకున్నాడు. అయితే శ్రీహాన్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. లాస్ట్ సీజన్‌లో సిరి బాయ్ ఫ్రెండ్‌గా స్టేజ్ పైకి వచ్చిన అతడు ఈసారి ఓ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీహాన్ అసలు పేరు వేరే ఉంది. అతడు ముస్లిం కుటుంబంలో జన్మించాడు. శ్రీహాన్ పుట్టింది వైజాగ్‌లో. అతడి తల్లి పేరు పర్వీన్ షేక్, తండ్రి పేరు అమీర్ ఎస్.కె. అతడికి ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.
శ్రీహాన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగపెట్టకముందు మూడేళ్ల పాటు నేవీలో పనిచేసేవాడు. అయితే నటన మీద మక్కువ ఉండటంతో తల్లిదండ్రులు పెట్టిన పేరును కాదని శ్రీహాన్ అని పేరు పెట్టుకున్నాడు. 2015లో ‘చారి లవర్ ఆఫ్ శ్రావణి’ అనే షార్ట్ ఫిలింతో శ్రీహాన్ తన యాక్టింగ్ కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ షార్ట్ ఫిలింలో అతడి సరసన సిరి హనుమంత్ నటించింది. అలా వీళ్లిద్దరి మధ్య పరిచయం తర్వాత ప్రేమగా మారింది. 2017లో సాఫ్ట్‌వేర్ బిచ్చగాడు షార్ట్ ఫిలింతో శ్రీహాన్‌కు మంచిపేరు వచ్చింది. తర్వాత పలు షార్ట్ ఫిలింస్‌లో నటించడంతో యూట్యూబర్‌గా పేరు వచ్చింది. ఈటీవీ ప్లస్ ఛానల్‌లో అమ్మాయి క్యూట్ అబ్బాయి నాట్, పిట్టగోడ వంటి సీరియళ్లలో నటించాడు. సోషల్ మీడియాలో కూడా శ్రీహాన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. శ్రీహాన్ నటుడు, యూట్యూబర్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా.
బిగ్‌బాస్-6లో స్టేజీ పైకి ఎంట్రీ ఇస్తూనే పాట పాడి నాగార్జునతో పాటు ప్రేక్షకులను కూడా శ్రీహాన్ ఎంటర్‌టైన్ చేశాడు. పూర్తి పాజిటివిటీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన శ్రీహాన్.. నెగిటివిటీని మూటకట్టుకున్నాడు. ఆడాళ్లతో ప్రవర్తించే విధానం.. శ్రీసత్యతో నడిపే యవ్వారాలు.. వెకిలి చేష్టలు.. అబద్ధాలు.. చిల్లర యాటిట్యూడ్ ఇవన్నీ శ్రీహాన్‌కి నెగిటివ్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీసత్యతో ఇతని రిలేషన్‌పై ఆమె చేతిలో ఇతను కీలుబొమ్మగా మారడంతో శ్రీహాన్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే బిగ్‌బాస్-5లో తన ప్రేయసి సిరికి బయటి నుంచి శ్రీహాన్ ఎంతో సపోర్ట్ చేశాడు. అందుకే బిగ్‌బాస్-6లో శ్రీహాన్‌కు సిరి కూడా మద్దతు తెలిపింది. ఈ విధంగా ఒకరికొకరు సహకారం అందించుకోవడంతో శ్రీహాన్ ఫైనల్‌కు వెళ్లాడు. సిరితో కలిసి శ్రీహాన్ చేసిన వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింలు అన్నీ పెద్ద హిట్లుగా నిలిచాయి. సిరి, శ్రీహాన్ పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఒప్పించారు. వీరు ఓ బాబుని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు.