
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో, ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెలలోనే తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. ఈలోగా పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలలో నటించేలా ప్రణాళికలు రచించారు. ఈ జాబితాలో సాయిధరమ్‌తేజ్‌తో కలిసి నటించే వినోదయ సీతం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలతో పాటు సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్‌గా కనిపిస్తారని సమాచారం అందుతోంది. సాహో తర్వాత సుజిత్ దర్శకత్వం వహించే సినిమా ఇదే కానుంది. ఈ మూవీని ఆర్.ఆర్.ఆర్ వంటి పాన్ వరల్డ్ సినిమాను అందించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించబోతుంది.
2024 ఎన్నికల నాటికి ఈ సినిమాలన్నీ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన హరిహరవీరమల్లు టీజర్ అందరినీ ఆకట్టుకుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్‌తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్‌ను ఆయన అందించారు. హరిహర వీరమల్లు షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత పవన్ తన తదుపరి సినిమాలు ప్రారంభిస్తారని టాక్ నడుస్తోంది. అటు ఇప్పటికే సుజిత్ పవన్‌ను కలిసి ఓ కథను చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఈ కథపై మరికాస్త సాన బెట్టాలని పవన్ సూచించారని అంతా ఓకే అయితే ఈ సినిమాలో పవర్ ఫుల్ డాన్ పాత్రలో పవన్ కనిపించనున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. గతంలో రన్ రాజా రన్, సాహో సినిమాలకు సుజిత్ దర్శకత్వం వహించాడు. వీటిలో ప్రభాస్‌తో తెరకెక్కించిన సాహో సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు పవర్‌స్టార్ అభిమానులు కంగారు పడుతున్నారు. సుజిత్ తమ హీరోను ఎలా హ్యాండిల్ చేస్తారనే టెన్షన్ పవన్ అభిమానుల్లో కనిపిస్తోంది.
సుజిత్ తెరకెక్కించిన సాహో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. మన దగ్గర కంటే బాలీవుడ్లో ఈ సినిమా సంచలనం క్రియేట్ చేసింది. అక్కడ భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఆ తర్వాత సుజిత్‌కు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. గాడ్ ఫాదర్ సినిమాను ముందు సుజిత్‌తో చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న సుజిత్ ఓ రీమేక్ కథతో పవన్‌తో సినిమా చేయనున్నాడని అంటున్నారు. తమిళంలో దళపతి విజయ్ నటించిన తేరి సినిమాను ఇప్పుడు రీమేక్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసే పనిలో సుజిత్ ఉన్నాడట. పవన్ తాజా సినిమాల లైనప్ చూస్తే ఈ లెక్కన మరో 6 నుంచి 8 నెలల పాటు పవన్ కళ్యాణ్ సెట్స్ మీద బిజీగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. సుజిత్-పవన్ కాంబోలో తాము సినిమా నిర్మిస్తున్నట్లు వస్తున్నవన్నీ తప్పుడు వార్తలని, తమ నుంచి ఏదైనా సినిమా రాబోతుంటే ఆ విషయాన్ని తామే అధికారికంగా ప్రకటిస్తామని, ఇలాంటి వార్తలను నమ్మొద్దని డీవీవీ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.