
భారత క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేకంగా తన పేజీలను సృష్టించుకన్నక్రికెటర్. ధోనికి దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. ధోని చిన్న యాడ్‌లో కనిపించినా ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. అలాంటిది సినిమాల్లోకి ప్రవేశిస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి. అందుకే ఆటలతో పాటు సినిమాల్లోనూ రాణించాలని ధోనీ ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే సినిమాల్లో నిర్మాతగా ప్రవేశించాలని వ్యూహాలు రచిస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరపున ఆయన ఆడటంతో తమిళ ప్రజలకు ధోనీ అంటే ప్రాణం. అతడిని ముద్దుగా తలా అని పిలుచుకుంటారు. అలాంటి ధోనీ అభిమానులందరికీ అదిరిపోయే శుభవార్త. ఇప్పుడు అతడు తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఇప్పటికే రోర్ ఆఫ్ లయన్, బ్లేజ్ టు గ్లోరీ, ద హిడెన్ హిందూ అనే మూడు షార్ట్ ఫిలింలను రూపొందించారు. ధోనీ, ఆయన సతీమణి సాక్షి వీటికి నిర్మాణ బాధ్యతలు వహించారు.
అయితే త్వరలో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాలని ధోనీ భావిస్తున్నాడు. తెలుగులో ధోనీ నిర్మాణంలో మహేష్ బాబు నటిస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక రాజమౌళి కాంబినేషన్‌లో మరో సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు అయ్యేసరికి రెండేళ్లు పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఇంతలో ధోనీ తమిళంలో విజయ్ హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా మలయాళం, కన్నడలో కూడా అగ్రహీరోలతో సినిమాలు తీయాలని ధోనీ ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే ఐపీఎల్ ధోనీకి చివరిది అని తెలుస్తోంది. ఈ ఐపీఎల్ ముగిశాక ధోనీ పూర్తిస్థాయిలో నిర్మాతగా తన వ్యవహారాలు చక్కబెట్టనున్నట్లు అతడి సన్నిహితులు చెప్తున్నారు.
అటు ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ అతడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా విజయవాడలో క్రికెట్ అభిమానులు ధోనీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ధోనీ విగ్రహం పెట్టారు. ప్రస్తుతం ధోనీ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్‌కు విగ్రహం పెట్టడం బహుశా ఇదే తొలిసారని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ధోనీ ఇండియన్ క్రికెట్‌కు గొప్ప సేవలు అందించాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లతో పాటు టెస్టుల్లోనూ నంబర్ వన్ ర్యాంకు అందుకుంది. అతడి నాయకత్వంలో రైనా, జడేజా, ధావన్, కోహ్లీ, అశ్విన్ వంటి ఆటగాళ్లు లైమ్ లైట్‌లోకి వచ్చారు. కాగా ధోనీతో మహేష్‌బాబు కమిట్ అయితే ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది.. స్టోరీ ఎలా ఉంటుంది.. డైరెక్టర్ ఎవరన్న ఊహాగానాలు ఫిల్మ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి.