
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం ఉదయం కన్నుమూశారు. 70 ఏళ్ల ఇందిరా దేవి కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో సమస్య కారణంగా ఆమె మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు ఇందిరాదేవి హఠాత్తుగా మరణించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఇందిరా దేవి కాగా రెండో భార్య విజయనిర్మల. రెండో భార్య కొద్దికాలం కిందటే చనిపోగా ఇప్పుడు మొదటి భార్య కూడా మృతి చెందడంతో సూపర్‌స్టార్ కృష్ణ కుమిలిపోతున్నారు. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. వీరిలో ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
అమ్మాయిల్లో పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని అమ్మాయిలు ఉండగా.. అబ్బాయిల్లో రమేష్‌బాబు, మహేష్‌బాబు ఉన్నారు. వీరిలో రమేష్‌బాబు కూడా అనారోగ్యంతో ఈ ఏడాది జనవరిలో కన్నుమూశారు. రమేష్‌బాబు గతంలో సినిమాల్లో కూడా నటించాడు. ఆయన తన సోదరుడు మహేష్‌తో కలిసి కొడుకు దిద్దిన కాపురం సినిమాలో కూడా నటించాడు. అయితే కాలం కలిసి రాకపోవడంతో అనంతరం నిర్మాతగా వ్యవహరించాడు. మహేష్ నటించిన అర్జున్ సినిమాకు రమేష్‌బాబు నిర్మాతగా ఉన్నారు. అటు ముగ్గురు కుమార్తెలలో ఒకరు గల్లా జయదేవ్‌ను వివాహం చేసుకోగా మరొకరు సంజయ్ స్వరూప్ అనే నటుడిని వివాహమాడారు. ఇందిరా ప్రియదర్శిని హీరో సుధీర్ బాబును వివాహమాడారు. అందుకే మహేష్, సుధీర్ బావబావమరుదులుగా ఇండస్ట్రీలో చాలా సన్నిహితంగా కనిపిస్తుంటారు. మహేష్ సినిమాకు సంబంధించిన ఫంక్షన్‌లకు సుధీర్ బాబు.. సుధీర్ నటించిన సినిమా ఈవెంట్లకు మహేష్ హాజరవుతుంటారు.
అటు సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయనిర్మల కూడా ఈ మధ్యనే కాలం చేయడంతో ఆయన చాలా కుంగిపోయారు. ఆయన ఎక్కువగా బయటకు కూడా రావడం లేదు. ఇప్పుడు తనకు మేనకోడలు వరుసయ్యే మొదటి భార్య ఇందిరాదేవి కూడా కన్నుమూయడంతో ఆయన మరింత కృంగిపోతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొద్దికాలంగా కృష్ణ వయసురీత్యా సినిమాల్లో కూడా నటించడం లేదు. ఆయన చివరగా ఐదేళ్ల క్రితం విడుదలైన శ్రీశ్రీ మూవీ తర్వాత మరే సినిమాలో నటించలేదు. నిజానికి హీరో మహేష్ బాబుకు ఇందిరా దేవి అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో మహేష్ బాబు బయట పెడుతూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు స్వయానా కన్నతల్లి కన్నుమూయడంతో మహేష్ బాబు మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇందిరాదేవి అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహేష్ అభిమానులు తరలివచ్చి అశ్రునయనాలతో కడసారి ఇందిరాదేవికి అంతిమవీడ్కోలు పలికారు.