
మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మలయాళ ఇండస్ట్రీలో నంబర్‌వన్ హీరో. విలక్షణ నటుడిగా ఆయనకు మంచి పేరుంది. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో కనిపించారు. అయితే ఆయన తాజాగా ఓ కేసులో ఇరుక్కున్నారు. కొంత కాలం క్రితం ఇంకమ్‌ట్యాక్స్ అధికారులు మోహన్ లాల్ నివాసంలో సోదాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఐటీ శాఖ అధికారులు రెండు ఏనుగు దంతాలను గుర్తించారు. అయితే ఆ సమయంలో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ మీద కేసులు నమోదు చేయలేదు. అయితే ఈ విషయం కేరళ అటవీ శాఖ అధికారుల చెవిలో పడింది. దీంతో మోహన్‌లాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన అక్రమంగా ఏనుగు దంతాలు దాచుకుని చట్టాన్ని ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు.
అయితే తనపై అక్రమంగా నమోదు చేసిన ఏనుగు దంతాల కేసును కొట్టివేయాలని మోహన్‌లాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవడానికి అనుమతి లేదని ట్రయల్ కోర్టు విచారణకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ లాల్‌కు తలనొప్పులు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకున్న మోహన్ లాల్ మీద చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేరళ హైకోర్టు వీరి వాదనలు వినడానికి అనుమతి కూడా ఇచ్చింది. ఎవరైనా అక్రమంగా ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకున్నారని కోర్టు విచారణలో వెలుగు చూస్తే మూడేళ్ల నుంచి ఏడేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. దీంతో తమ అభిమాన నటుడికి జైలు శిక్ష పడుతుందని మోహన్‌లాల్ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.
మరోవైపు మనీ లాండరింగ్ వ్యవహారం కింద మోహన్‌లాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం అందుతోంది. వచ్చే వారం విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. విచారణ కోసం కొచ్చిలోని ఈడీ కార్యాలయానికి రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మోహన్‌లాల్ సినిమాల విషయానికి వస్తే కొన్ని నెలల కిందట ఆయన నటించిన మరక్కార్ సినిమా అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ తెరకెక్కి అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అనంతరం మోహన్‌లాల్ నటించిన బ్రో డాడీ సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం మోహన్‌లాల్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో మోహన్‌లాల్ జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో ఆయన సినిమాల నిర్మాతలు కంగారు పడుతున్నారు. ఇటీవల మోహన్‌లాల్ ఓ క్రేజీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమాలో శంకర్ ఓ పాత్రను మోహన్‌లాల్ ఆఫర్ చేశాడని, దాన్ని ఆయన రిజెక్ట్ చేశాడనే టాక్ నడుస్తోంది.