
బిగ్‌బాస్ షో యూనివర్సల్ రియాలిటీ షో. నిబంధనల ప్రకారమే పలువురు సెలబ్రిటీలు బిగ్‌బాస్ షోలో పాల్గొంటారు. హౌస్‌లో టాస్కుల విషయంలో సెలబ్రిటీలకు ముందే అవగాహన ఉంటుంది. అయితే ఇటీవల బిగ్‌బాస్ షోలో అశ్లీలత పెరిగిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం బిగ్‌బాస్ ఆరో సీజన్ నడుస్తోంది. తొలి సీజన్ ముంబై సమీపంలో షూటింగ్ జరుపుకోగా రెండో సీజన్ నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ప్రత్యేకంగా సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. అయితే లోకల్‌గా షూటింగ్ జరుపుకోవడం ఈ షోకు మైనస్ అయిపోయింది. హౌస్ నుంచి కంటెస్టెంట్ ఎవరు బయటకు వచ్చారో ఒకరోజు ముందే లీకైపోతుంది. దీంతో పలువురికి మజా ఇవ్వడంలో ఈ షో ఫ్లాప్ అవుతోంది. తాజాగా ఈ షోలో చోటు చేసుకుంటున్న అశ్లీలత గురించి అమరావతిలోని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ పిటిషనర్ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తరపున న్యాయవాది శివప్రసాద్ పిల్ దాఖలు చేశారు. ఐబీఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయాన్ని పాటించాలన్న పిటిషనర్ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే బిగ్‌బాస్ టెలికాస్ట్ చేయాలని పిటిషన్‌లో కోరారు. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. అశ్లీలత ఉన్న కారణంగా ఈ షోను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1970లలో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసుకదా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించేందుకు కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామన్న న్యాయస్థానం.. విచారణను అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు బిగ్ బాస్ బూతుల స్వర్గమని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అది రియాల్టీ షో కాదు బూతు షో అని అంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారా సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు అని నిలదీస్తున్నారు.
ఇప్పటికే సీపీఐ నేత నారాయణ బిగ్‌బాస్ షో గురించి పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు కౌంటర్‌గా నాగార్జున అవకాశం దొరికినప్పుడల్లా నారాయణ.. నారాయణ అనే మంత్రాన్ని జపిస్తున్నారు. ఈ షో సమాజాన్ని చెడగొట్టేలా ఉందంటూ నారాయణ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్‌తో పోల్చారు. అయితే ఎన్ని విమర్శలు వస్తున్నా, ఎన్ని కేసులు పెడుతున్న బిగ్ బాస్ ఇండియా మొత్తం సీజన్‌లకు సీజన్లు పుట్టుకు వస్తున్నాయి. హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు బాషల్లోనూ బిగ్‌బాస్ షో సూపర్ సక్సెస్ అయింది. తెలుగులో టాలీవుడ్ టాప్ స్టార్ నాగార్జున ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోలతో పలువురు కంటెస్టెంట్లు, అనామకులు కొన్నిరోజుల్లోనే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. సినిమాల్లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే కొందరు డబుల్ మీనింగ్ డైలాగులతో రోత పుట్టిస్తున్నారని, బూతులు మాట్లాడుకుంటూ చిల్లరగా వ్యవహరిస్తున్నారని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.