
మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న హీరో మంచు విష్ణు ఇటీవల జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించారు. వీరిద్దరూ నటించడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను మంచు మోహన్ బాబు ఆశీస్సులతో ఏవా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో విష్ణు మంచు స్వయంగా నిర్మించాడు. కొత్త దర్శకుడు ఈషాన్ సూర్య జిన్నా మూవీకి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీపావళికి పోటీ సినిమాల మధ్య విడుదల కావడం కూడా ఈ మూవీకి మైనస్ పాయింట్ అయ్యింది. కార్తీ సర్ధార్, విశ్వక్ సేన్ ఓరి దేవుడా, శివ కార్తీకేయన్ ప్రిన్స్ సినిమాలు కూడా దీపావళికి విడుదలై మంచి టాక్ సంపాదించాయి. దీంతో జిన్నా మూవీని ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు.
నిజానికి జిన్నా సినిమా చూసిన విమర్శకులు ఘోరమైన రివ్యూలు అయితే ఇవ్వలేదు. ఇది మరీ అంత చెత్త సినిమా కాదని.. ఒకసారి చూడొచ్చని చెప్పారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను పూర్తిగా అవైడ్ చేశారు. ఈ సినిమాను రూ.15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా కేవలం కోటి రూపాయలను మాత్రమే వసూలు చేసి భారీ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతగా మంచు విష్ణుకు భారీ నష్టాన్ని ఈ మూవీ మిగిల్చింది. అయితే అనూహ్యంగా ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. గతంలో మంచు విష్ణు నటించిన సినిమాలకు బాలీవుడ్ మార్కెట్‌లో మంచి ఆదరణ లభించడంతో జిన్నా మూవీని రూ.10 కోట్లు ఇచ్చి డబ్బింగ్ హక్కులు పొందినట్లు సమాచారం అందుతోంది. శృంగార తార సన్నీ లియోన్ ఈ మూవీలో నటించడం కూడా భారీ ధర పలకడానికి కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అటు థియేట్రికల్ రైట్స్ ద్వారా నష్టపోయిన నిర్మాత మంచు విష్ణు హిందీ డబ్బింగ్ రైట్స్‌తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ అన్ని కలుపుకుంటే జిన్నా సినిమాకు భారీగా లాభాలను ఆర్జించినట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఓటీటీలో కచ్చితంగా చూసే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విష్ణు గత సినిమా మోసగాళ్లు మూవీ హిందీ డబ్బింగ్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ప్రస్తుతం మంచు విష్ణు ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అయితే అతడి సినిమాల్లో ఎక్కువగా సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచే తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు నష్టాలను తెచ్చిపెడుతుండటంతో ఇకపై బయటి నిర్మాతలతోనూ సినిమాలు చేయాలని మంచు విష్ణు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జిన్నా తర్వాత అతడు ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఢీ-2 వంటి సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో కాలమే సమాధానం చెప్పాలి.