
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ అంటే ఓ పేరు కాదు బ్రాండ్ అని చెప్పాలి. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే జరిగే హడావిడి మాములుగా ఉండదు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈ ఏడాది ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీ తర్వాత పవన్ వరుసగా సినిమాల్లో నటిస్తారని ప్రచారం జరిగింది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో పవన్ ఈ సినిమాలను ఫినిష్ చేసి డబ్బులు సంపాదించి వాటిని ఎన్నికల్లో పెట్టుబడిగా వినియోగించుకుంటారని అభిమానులు ఆశించారు. అయితే అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి తరహాలో ఇప్పటివరకు పవన్ సినిమా ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయాలపై దృష్టి మళ్లించడం, ఇటీవల వైరల్ ఫీవర్ బారిన పడటంతో పాటు ప్రస్తుతం షూటింగ్‌లు నిలిచిపోవడంతో హరిహరవీరమల్లు షూటింగ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అనేలా తయారైంది.
అసలు ఎపుడో పూర్తి కావాల్సిన హరిహరవీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డేట్స్‌ను పవన్ కళ్యాణ్ అడ్జస్ట్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత క్రిష్.. వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం అనే సినిమాను కూడా పూర్తి చేశాడు. అటు హాట్ స్టార్ కోసం 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ కూడా పూర్తి చేశాడు. ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. త్వరలోనే మళ్లీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో సాగే కథగా ఇది తెలుస్తుంది. జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని భావిస్తున్నారు. కానీ పవన్ రాజకీయాల వైపు బిజీగా ఉండటంతో ఈ సినిమా మరింత ఆలస్యం కానున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.
అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను కూడా పవన్ చేయాల్సి ఉంది. హరిహరవీరమల్లు సంగతే అయోమయంలో ఉండటంతో పవన్ కొత్త సినిమాల పరిస్థితి డోలాయమానంగా మారింది. అనుకున్న ప్రకారం ఈ మూవీ మొదలైతే సగానికి పైగా షూటింగ్ పూర్తి కావాల్సింది. అయితే పవన్ రాజకీయ కార్యక్రమాలతో పాటు మధ్యలో భీమ్లా నాయక్ చేయడం వల్ల ఈ మూవీ ఆలస్యమైంది. అటు అక్టోబర్ నుంచి జనసేన పార్టీ బస్సు యాత్రను ప్లాన్ చేస్తోంది. దీంతో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు సాయిధరమ్‌తేజ్‌తో నటించాల్సిన వినోదయ సీతం మూవీ సంగతి కూడా అటూ ఇటూ తేలడం లేదు. మొత్తానికి చూస్తుంటే వచ్చే రెండేళ్లు పవన్ సినిమాలతో ట్రావెల్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో భీమ్లానాయక్ సినిమానే ఆయన ఆఖరి సినిమా అవుతుందా అని పవర్‌స్టార్ అభిమానులు కంగారు పడుతున్నారు. కొత్త సినిమాల విషయంలో పవన్ ఏదో ఒక ప్రకటన చేస్తే కానీ అభిమానులు శాంతించేలా కనిపించడం లేదు.