
అజ్ఞాతవాసి తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో గత ఏడాది మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చినా ఈ సినిమా కరోనా వల్ల భారీ వసూళ్లను సాధించలేకపోయింది. దీంతో పవన్ నటించిన భీమ్లా నాయక్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తొలి షోతోనే భారీ రెస్పాన్స్ రావడం, సూపర్ హిట్ అనే మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఏపీలో తప్ప ఈ సినిమా అన్ని చోట్ల ప్రాఫిట్ వెంచర్‌గా నిలిచిందనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏపీలో ఈ సినిమా కలెక్షన్‌లు అడ్డుకోవడానికి స్వయంగా ఏపీ ప్రభుత్వం కుట్రలు చేసిందని ఇప్పటికీ పవర్‌స్టార్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
సుమారు రూ.3 కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బలగాలను సీఎం జగన్ థియేటర్ల దగ్గర మోహరించారని..బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ప్రదర్శించకుండా అడ్డుకున్నారని విమర్శలు కూడా వచ్చాయి. ప్రత్యేక అధికారులను నియమించి థియేటర్లను తనిఖీలు చేయించి కొన్నింటిని కక్షపూరితంగా సీజ్ చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే ఇన్ని చేసినా భీమ్లా నాయక్‌కు వచ్చిన టాక్‌ను ఏపీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. ఎన్నో ఇబ్బందులను దాటుకుని ఈ మూవీ రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పవన్ కళ్యాణ్‌తో పాటు దగ్గుబాటి రానా పోటాపోటీగా ఈ మూవీలో నటించాడు. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సాగర్ కె. చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీకి తమన్ సంగీతం సమకూర్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు ఇచ్చాడు.
భీమ్లా నాయక్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీకి రూ. 106.75 కోట్ల బిజినెస్ జరిగింది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా టోటల్ రన్‌లో తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు దక్కాయి. నైజాంలో రూ. 35.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.65 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.49 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.11 కోట్లు, గుంటూరులో రూ. 5.26 కోట్లు, కృష్ణాలో రూ. 4.29 కోట్లు, నెల్లూరులో రూ. 2.80 కోట్లతో మొత్తం రూ. 117.85 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు. రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్ సినిమాల తరహాలో భీమ్లానాయక్ మూవీకి ఏపీ ప్రభుత్వం కూడా టిక్కెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఇచ్చి ఉంటే ఈ కలెక్షన్‌ల రేంజ్ మరింత పెరిగి ఉండేదని పవర్ స్టార్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.