
బాలీవుడ్ అగ్రతారలు రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహర్ రూపొందించిన బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కింది. కరోనా తర్వాత హిందీ పరిశ్రమ డీలా పడిన పరిస్థితుల్లో బ్రహ్మాస్త్ర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ముందడుగు వేశారు. మొత్తానికి ఈ మూవీ వసూళ్లు బాలీవుడ్‌కు ఊపిరి పోశాయి. క్లోజింగ్ వసూళ్ల విషయానికి వస్తే బ్రహ్మాస్త్ర ప్రపంచ వ్యాప్తంగా రూ.450 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. తెలుగులో రూ.22 కోట్ల గ్రాస్, రూ.12 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ హిందీ వెర్షన్ విషయంలో ఈ మూవీ బయ్యర్లను నిరాశపరిచిందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.బ్రేక్ ఈవెన్‌కు ఈ మూవీ రూ.150 కోట్ల దూరంలో నిలిచిపోయిందని స్పష్టం చేశారు.
ముఖ్యంగా నేషనల్ సినిమా డే బ్రహ్మాస్త్ర వసూళ్లకు ప్రాణం పోసింది. ఆ రోజు దేశవ్యాప్తంగా అన్ని మల్టీప్లెక్సులు టిక్కెట్ ధరలను తగ్గించడంతో ప్రేక్షకులు ఈ మూవీని చూసేందుకు ఇష్టపడ్డారు. నేషనల్ సినిమా డే వీకెండ్‌లో బ్రహ్మాస్త్ర రూ.23 కోట్లు రాబట్టింది. అంతకు ముందు వారాలతో పోల్చుకుంటే ఈ వసూళ్లు ఎక్కువ అని ట్రేడ్ అనలిస్టులు చెప్పారు. అటు ఓవర్సీస్‌లో 104 కోట్ల రూపాయలు సాధించి ఇటీవల కాలంలో వంద కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా బ్రహ్మాస్త నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వసూళ్లలో ఈ మూవీ మూడో స్థానాన్ని ఆక్రమించింది. దేశవ్యాప్తంగా బ్రహ్మాస్త్ర చిత్రం రూ. 253 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఈ మధ్యకాలంలో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు రూ. 252 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ RRR 274 కోట్ల రూపాయలను వసూలు చేయగా, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం రూ.434 కోట్లు రాబట్టింది.
అటు త్వరలో బ్రహ్మాస్త్ర -2 మూవీ కూడా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. అయితే ఈ మూవీలో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలం క్రితం ఆర్యన్ ఖాన్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదరు ఫోటోలో అతడు బ్రహ్మస్త్ర-2లో ఆర్యన్ ఖాన్ కనిపిస్తాడని పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే తొలిభాగంలో షారుఖ్ నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రెండో భాగంలో ఆర్యన్ ఖాన్ వానర అస్త్రంగా కనిపిస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. విజువల్ వండర్ కావడం, రాజమౌళి సమర్పణ, అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించడంతో తెలుగులో బ్రహ్మాస్త్ర సినిమాకు క్రేజ్ ఏర్పడింది. తెలుగులోనూ పోటీ సినిమాలు లేకపోవడంతో అందరూ బ్రహ్మాస్త్రను వీక్షించినట్లు తెలుస్తోంది.