
తెలుగు ప్రేక్షకులు హీరో ఎవరు అని చూడకుండా సినిమాలో కంటెంట్ ఉంటే ఏ భాష సినిమాను అయినా నెత్తిన పెట్టుకుంటారు. తమిళ హీరోలు అలాంటి సినిమాలతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విక్రమ్, విశాల్, సూర్య, కార్తీ మంచి సినిమాలతో తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకున్నారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరో తమిళ హీరో విజయ్ ఆంటోనీ. అతడు కేవలం హీరోగా మాత్రమే కాకుండా తమిళంలో పలు సినిమాలకు సంగీతం కూడా సమకూర్చాడు. నాన్, సలీం సినిమాల ద్వారా హీరోగా తనకంటూ గుర్తింపు సాధించిన విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. అక్కడి నుంచి విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కానీ విజయ్ ఆంటోనీ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. అతడి విజయవంతమైన కెరీర్ వెనుక భార్య ఫాతిమా మద్దతు ఉంది. భార్య ఇచ్చిన సలహాతోనే సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం సాగిస్తున్న విజయ్ హీరోగా నటించినట్లు తెలుస్తోంది.
ఫాతిమా అనే ఒక జర్నలిస్టును విజయ్ ఆంటోనీ ప్రేమించి పెళ్ళాడాడు. విజయ్‌ను ఇంటర్వూ చేయడానికి వచ్చిన ఆమెతో ప్రేమలో పడి 2006 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి లారా అనే కూతురు కూడా ఉంది. అయితే విజయ్ ఆంటోనీ జీవితంలో ఎన్నో కష్టాలు కూడా ఉన్నాయి. అతడి చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. ఆయన మరణించే నాటికి విజయ్ ఆంటోనీకి కేవలం ఏడు సంత్సరాలు మాత్రమే ఉన్నాయి. తన చెల్లి వయసు నాలుగు సంత్సరాలు మాత్రమే. దీంతో విజయ్ తల్లి ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించేది. ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినా పిల్లల చదువు దెబ్బతింటుందని ఉన్న చోటు నుంచే దూర ప్రయాణం చేసేది. విజయ్ ఆంటోనీ చదువులో టాపర్. అతడు బాగా చదివి అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడు. చెన్నైలోని లాయోల కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో తన స్టడీస్‌ను కంప్లీట్ చేశాడు. తరువాత సౌండ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యూయేట్ అయ్యాడు. తన తల్లి ఉద్యోగ రీత్యా ట్రైనింగ్ కోసం వెళ్లాల్సి రావడంతో విజయ్ మకాం హాస్టల్‌కు మారింది.
అప్పుడు విజయ్ పరిస్థితి దారుణంగా ఉండేది. అంతగా డబ్బు లేకపోవడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొనేవాడు. అనుకోకుండా స్కూల్‌కు, హాస్టల్స్‌కు సెలవులు వస్తే.. తన వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థుల శిబిరంలో తల దాచుకునేవాడు. అయితే చదువు పూర్తయిన వెంటనే సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీకి వచ్చాడు. 2012లో నాన్ అనే తమిళ సినిమా ద్వారా తెరకు పరిచయం అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన విజయ్.. ఆ తరువాత నటుడిగా, హీరోగా, సినిమా ఎడిటర్‌గా, నిర్మాతగా అనేక రకాలుగా సక్సెస్ లు చూసి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ మరో సస్పెన్స్ థ్రిల్లర్ హత్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కథ మొత్తం మోడల్ లైలా మర్డర్ మిస్ట్రీ చుట్టే తిరుగుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా.. రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. బాలాజీ కుమార్ దీనికి దర్శకత్వం వహించాడు. హత్య సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నట్లు.. హాలీవుడ్ మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్ కలుగుతుందని విజయ్ ఆంటోనీ చెప్తున్నాడు. కోలీవుడ్ నుంచి వచ్చినా తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఉందని అంటున్నాడు.