
టాలీవుడ్లో ప్రస్తుతం సంక్రాంతి సినిమాల సందడి నెలకొంది. ఈ సంక్రాంతికి సుమారు ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి వార్ నడుస్తోంది. గాడ్ ఫాదర్ మూవీ తర్వాత చిరంజీవి నటిస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. తొలుత ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తాజాగా విజయ్ వారసుడు మూవీని నిర్మాత దిల్ రాజు వాయిదా వేశాడు. 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం 14వ తేదీని విడుదలవుతుందని అఫీషియల్‌గా ప్రకటించాడు. ఒకవేళ వారసుడు మూవీ 11న విడుదలైతే ఏపీ, తెలంగాణలో ఎక్కువ థియేటర్లు అందుబాటులో ఉండేవి కావు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో చాలా థియేటర్లు దిల్ రాజు చేతిలో ఉన్నాయి.
అయితే సంక్రాంతి పండగకు తెలుగు సినిమాలకు కాకుండా తమిళ సినిమాకు థియేటర్లు లాక్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో దిల్ రాజు ఒక అడుగు వెనక్కి వేశాడు. వారసుడు మూవీని మూడు రోజులు ఆలస్యంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమా లేటుగా రిలీజ్ అవుతుండటంతో వాల్తేరు వీరయ్యకు తగినన్ని థియేటర్లు దొరికే అవకాశం ఉంది. అయితే వారసుడు తేదీపై వాల్తేరు వీరయ్య కన్నేశాడు. 11న ఈ మూవీని విడుదల చేస్తే వసూళ్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని నిర్మాత భావిస్తున్నాడు. 12న బాలయ్య సినిమా కూడా ఉండటంతో 11న దాదాపు అన్ని థియేటర్లలో వాల్తేరు వీరయ్యను విడుదల చేస్తే తొలిరోజు వసూళ్లు అదిరిపోనున్నాయి. గతంలో ఖైదీనంబర్ 150 సినిమా సమయంలో చిరు సినిమాను ముందు విడుదల చేశారు. అప్పట్లో అది ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు కూడా చిరు సినిమాను ఫస్ట్ విడుదల చేయడం బెటరనే టాక్ వినిపిస్తోంది.
వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రికార్డులు సృష్టించింది. వ్యూస్ అండ్ లైక్స్ విషయంలో బాలయ్య వీరసింహారెడ్డి కంటే మెరుగ్గా నిలిచింది. దర్శకుడు బాబీ చిరు అభిమాని అయినా పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరునే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. బాబీ తన అభిమాని అని కాకుండా నిరంతరం కష్టపడే తత్వం వల్ల అతనికి సినిమా అవకాశం ఇచ్చినట్లు చిరు చెప్పుకొచ్చాడు. ఈ మూవీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని అన్నారు. గంట సేపు చెప్పిన కథ కంటే కూడా ప్రతి రోజూ ఆ కథను చెక్కుతూ మరింత కష్టపడి చేసిన డైరెక్టర్ బాబీపై ప్రశంసల వర్షం కురిపించాడు. అటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థపైనా చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుస సినిమాలను నిర్మిస్తున్నఆ సంస్థ పదికాలాల పాటు నిలవాలని.. సినిమా తర్వాత సినిమా తీస్తే ప్లానింగ్ బాగుంటుందని చిరు అభిప్రాయపడ్డాడు. రంగస్థలం సినిమా తర్వాత ఈ బ్యానరులో పనిచేయాలన్న తన కోరిక త్వరగానే నెరవేరిందని తెలిపాడు.