
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్ షోకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ ఇప్పటికే ఆరు సీజన్‌లను బిగ్‌బాస్ పూర్తి చేసుకుంది. వీటితో పాటు ఓటీటీ సీజన్ కూడా నిర్వహించారు. అయితే ఓటీటీ సీజన్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పటివరకు జరిగిన సీజన్‌లన్నీ స్టార్ మాటీవీలోనే ప్రసారం అయ్యాయి. తొలి సీజన్‌కు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించగా మిగతా సీజన్‌లకు అక్కినేని నాగార్జున హోస్టుగా ఉన్నారు. అయితే వచ్చే సీజన్‌కు హోస్టు మారబోతున్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ ప్రసారమయ్యే ఛానల్ కూడా మారబోతుందని టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ మరో ఛానల్‌లో టెలీకాస్ట్ కాబోతుందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త అగ్రిమెంట్ ప్రకారం బిగ్‌బాస్ షోను స్టార్ మాలో కాకుండా జీతెలుగులో ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. ఒకవేళ చర్చలు సఫలమైతే జీతెలుగులోనే బిగ్‌బాస్ 7 టెలికాస్ట్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆరో సీజన్ విఫలం కావడం, రేటింగ్ కూడా దారుణంగా రావడంతో నిర్వాహకులు కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈసారి సరికొత్త రూల్స్‌తో కొత్త కంటెంట్‌తో బిగ్ బాస్ సీజన్ సెవెన్ తీర్చిదిద్దబోతున్నట్లు టాక్ నడుస్తోంది.ముఖ్యంగా సామాన్య ప్రజలతో పాటు యూట్యూబ్ స్టార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. అంతేకాకుండా అమౌంట్ కూడా ఎక్కువ పెంచే విధంగా బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తున్నారు. 6వ సీజన్ చాలా నీరసంగా కొనసాగింది. కంటెస్టెంట్స్ విషయంలోనే ప్రేక్షకులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగార్జున వచ్చిన వీకెండ్స్‌లో కూడా షో అంత ఆసక్తిగా మారకపోవడంతో రేటింగ్స్ కూడా ఈ సీజన్ చాలా వరకు తగ్గిపోయింది. దీంతో ఏడో సీజన్ అసలు ఉంటుందా లేదా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ఏడో సీజన్ ఉంటుందని.. కానీ సరికొత్తగా ఉండబోతుందన్న న్యూస్ విన్నాక బిగ్‌బాస్ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏడో సీజన్ కోసం నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం ఎంత తీసుకుంటున్నాడో అంతకంటే ఎక్కువ స్థాయిలో బిగ్ బాస్ షో కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ బిగ్‌బాస్ నిర్వాహకులు ఇచ్చే ఆఫర్ ఎక్కువగా ఉంటే మాత్రం బాలయ్య టెంప్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. టాలీవుడ్‌లో అఖండ సినిమా తర్వాత బాలయ్యకు క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కూడా నమోదైంది. అఖండ తర్వాత అన్ స్టాపబుల్ షో కూడా బాలయ్యను మరో రేంజ్‌కు తీసుకువెళ్లింది. ఇప్పుడు బాలకృష్ణ ఏది పట్టుకున్న బంగారమే అనే తరహాలో టైం నడుస్తోంది. ఈ మేరకు బిగ్‌బాస్ షోను కూడా ఆయన చేతుల్లోనే పెట్టాలన్న డిస్కషన్‌లు నడుస్తున్నాయి.