
రియాలిటీ షోల విషయంలో బిగ్‌బాస్ షోకు ఉన్న పాపులారిటీ మరే ఇతర షోలకు ఉండదు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే బిగ్‌బాస్ ఐదు సీజన్‌లను దిగ్విజయంగా ముగించుకుని ఇప్పుడు ఆరో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్-6 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. కీర్తి భట్, రేవంత్, ఆర్జే సూర్య, ఆదిరెడ్డి, ఫైమా, చలాకీ చంటి, ఇనయా సుల్తానా, గీతూ రాయల్, షానీ సాల్మన్, వాసంతి కృష్ణన్, బాలాదిత్య, మెరీనా, రోహిత్, అభినయశ్రీ, అర్జున్ కళ్యాణ్, శ్రీహాన్, శ్రీసత్య, నేహా చౌదరి, సుదీప, రాజశేఖర్, ఆరోహి సెలబ్రిటీలుగా హౌస్‌లోకి వెళ్లారు. అయితే వీరిలో గీతూ రాయల్ తొలి రోజు నుంచే అరుపులు, కేకలతో హౌస్‌ను హోరెత్తిస్తోంది. తొలిరోజే బాత్‌రూమ్ కడిగే విషయంపై ఇనయా సుల్తానాతో గొడవ పెట్టుకుంది. అంతేకాకుండా ఎమోషనల్ స్టోరీ చెప్పే సమయంలో కూడా ఇనయాపై గీతూ రాయల్ నోరు పారేసుకోవడం వీక్షకులకు నచ్చలేదన్న టాక్ నడుస్తోంది. రెండేళ్ళ క్రితం కోల్పోయిన తన తండ్రి రెహమాన్ పేరును నిలబెట్టడం కోసం ఆయన కూతురుగా ఓ ఐడెంటిటీని పొందడం కోసమే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చానంటూ ఇనయా కన్నీటి పర్యంతం కావడంతో తోటి కంటెస్టెంట్స్ సైతం ఆమె పట్ల సానుభూతిని చూపించారు. కానీ గీతూ రాయల్ మాత్రమే ఇనయాను కించపరుస్తూ మాట్లాడింది.
మరోవైపు బిగ్‌బాస్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లపైనా సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌లోకి జబర్దస్త్ ఫేం ఛమ్మక్ చంద్ర, యాంకర్ వర్షిణి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. మూడో వారంలో వీళ్ల ఎంట్రీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ లోపు హౌస్ నుంచి ఎంతమంది ఎలిమినేట్ అవుతారన్న అంశం కూడా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్ ఇనయ సుల్తానా అరుపులు, అలకలు, గలాట గీతూ ఓవర్ యాక్షన్, డ్రామాలతో నిండిపోయింది. మన పని అయ్యే వరకు ఒకలా.. అవ్వకపోతే ఇంకోలా మాట్లాడటం గీతూకే చెల్లింది. ఇక తాను ఎలాగూ ఎలిమినేట్ కాను అని రేవంత్ చెప్పిన మాటల్లో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. ఆదిరెడ్డి మొదటి కెప్టెన్ కావాలని ఉందనే కోరికను కూడా బయటపెట్టేశాడు. అటు కంటెస్టెంట్ల సత్తా తెలుసుకునేందుకు ఈ వారం బిగ్‌బాస్ గేమ్ ఆడించాడు. మొదటిరోజే ఇంటి సభ్యులను క్లాస్.. మాస్.. ట్రాష్ అంటూ మూడు భాగాలుగా విడిపోవాలన్నాడు. విశేష అధికారాలుండే క్లాస్ టీమ్‌లో బాలాదిత్య, శ్రీహాన్, సూర్య ఉండగా రేవంత్, గీతూ, ఇనయ సుల్తానా ట్రాష్‌లోకి.. మిగిలిన వారంతా మాస్ టీమ్‌లోకి వచ్చారు. అయితే సమయానుసారం ఛాలెంజ్‌లు ఇస్తూ కంటెస్టెంట్లు టీమ్ మార్చుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ కల్పిస్తున్నాడు.
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కుల్లో గెలిచిన రేవంత్, నేహా మాస్ టీమ్‌లోకి వెళ్లారు. మరోవైపు బాలాదిత్య, అభినయ ట్రాష్‌లోకి వెళ్లారు. ఫైనల్‌గా ఈవారం క్లాస్.. మాస్.. ట్రాష్ టాస్క్ ముగిసిందని బుధవారం నాడు బిగ్‌బాస్ ప్రకటించాడు. నేహా, ఆదిరెడ్డి, గీతూ రాయల్ క్లాస్ టీమ్‌లో ఉన్న కారణంగా ఈ ముగ్గురూ నామినేషన్స్‌లో లేరని ప్రకటించాడు. అంతేకాదు వీరు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ట్రాష్ టీమ్‌లో ఉన్న బాలాదిత్య, అభినయశ్రీ, ఇనయ సుల్తానా ఈ వారం నేరుగా నామినేషన్‌లోకి వచ్చారు. తండ్రిని తలుచుకుని కన్నీటి పర్యంతమైన ఇనయా రెహ్మాన్ డైరెక్ట్ గా ఈ వారం నామినేట్ అయిపోయింది. వీరికి తోడుగా ఇంకా ఎవరినైనా బిగ్ బాస్ నామినేట్ చేస్తాడో చూడాలి. ఒకవేళ ఈ వారానికి ఈ ముగ్గురే నామినేషన్స్‌లో ఉంటే మాత్రం బాలాదిత్య, అభినయశ్రీ సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అదే జరిగితే ఇనయా రెహ్మాన్ బయటకు వచ్చేయడం ఖాయం. కానీ కనీసం పదిమందినైనా బిగ్ బాస్ తొలివారం నామినేట్ చేస్తుంటాడు కాబట్టి.. ఆ లిస్ట్ లోకి ఎవరెవరు చేరతారో వేచి చూడాల్సిందే.