
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ దిగ్విజయంగా ముగిసింది. 105 రోజుల పాటు సాగిన ఈ షో విజేతగా ప్రముఖ సింగర్ రేవంత్ నిలిచాడు. శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్‌లో పెద్ద ట్విస్ట్ నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే శ్రీహాన్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయి. కానీ అతడు రన్నరప్‌గా నిలవడానికి కారణంగా హోస్ట్ నాగార్జున ఇచ్చిన మనీ ఆఫర్‌కు టెంప్ట్ కావడమే. టాప్-2గా నిలిచిన రేవంత్, శ్రీహాన్‌లను స్టేజీపైకి తీసుకురావడానికి ముందు నాగార్జున సూట్‌కేస్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. ఈ సందర్భంగా రూ.40 లక్షలు ఆఫర్ చేయడంతో శ్రీహాన్ కన్ఫ్యూజన్‌లో పడిపోయాడు. చాలా మంది కంటెస్టెంట్లు శ్రీహాన్‌ను డబ్బులు తీసుకోవాలని కోరారు. నలభై లక్షల రూపాయలు అనగానే శ్రీహాన్ తల్లిదండ్రులు కూడా టెంప్ట్ అయ్యారు. దీంతో శ్రీహాన్ రూ.40 లక్షలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అమ్మ, నాన్న కోసం తీసుకుంటున్నా అని చెప్పి శ్రీహాన్ ఒప్పుకున్నాడు. దీంతో రేవంత్‌ను బిగ్‌బాస్ విన్నర్‌గా నాగార్జున ప్రకటించాడు.
మరోవైపు ఓట్ల పరంగా ఎవరు విన్నరో కూడా చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందని , అత్యధిక ఓట్లు పడింది శ్రీహాన్‌కేనని నాగార్జున చెప్పాడు. దీంతో రేవంత్ ముఖం మాడిపోయింది. అటు రియల్ విన్నర్ తానే అంటూ శ్రీహాన్ సంబరపడ్డాడు. ఇది చాలు అంటూ నాగ్‌తో చెప్పాడు. శ్రీహాన్ నలభై లక్షల రూపాయలు అందుకోవడంతో మిగతా పది లక్షల రూపాయల చెక్‌ను రేవంత్‌కు నాగ్ అందించాడు. అలాగే ఫ్లాట్, కారు తాళాలు కూడా రేవంత్‌కు వచ్చాయి. శ్రీహాన్‌కు సువర్ణ భూమి ప్రాపర్టీలో ప్లాట్ కొంటే యాభై శాతం తగ్గిస్తామని నిర్వాహకులు మాట ఇచ్చారు. రేవంత్‌కు 30 లక్షలు విలువ చేసే ప్లాట్, 12 లక్షల విలువ చేసే కారు, పది లక్షల రూపాయలు దక్కాయి. అంటే మొత్తంగా అతడికి 52 లక్షల దాకా వచ్చింది. మరోవైపు పారితోషికంతో కలుపుకుంటే రేవంత్‌కు రూ.80 లక్షల వరకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్‌లో రేవంత్, శ్రీహాన్ ఇద్దరూ విజేతలుగా నిలిచి ఆర్ధికంగా లాభపడినట్లు అయ్యింది.
అయితే ట్రోఫీ అందుకున్న తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన రేవంత్ తన స్నేహితుడు శ్రీహాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీహాన్ డబ్బులు తీసుకోననని చెప్పి.. నాగార్జున ఇచ్చిన ఆఫర్‌కు టెంప్ట్ అయ్యాడని ఆరోపించాడు. కానీ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని.. ప్రేక్షకుల నిర్ణయమే శిరోధారం అని భావించానని రేవంత్ అన్నాడు. తనపై తనకు నమ్మకం ఉందని అందుకే తాను డబ్బు తీసుకోలేదని చెప్పాడు. డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చని.. కానీ పేరు సంపాదించుకోవడం కుదరదని రేవంత్ చెప్పాడు. భవిష్యత్‌లో బిగ్‌బాస్ 6 విన్నర్ ఎవరు అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే తన పేరు కనిపిస్తుందని.. తనకు అది చాలన్నాడు. డబ్బు తీసుకుంటే రేపు ఖర్చు అయిపోతుందని.. అందుకే తనకు డబ్బు తీసుకోవాలన్న ఆశ కలగలేదన్నాడు. అభిమానులతో పాటు తన పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇవ్వడం వల్లే తాను బిగ్‌బాస్ హౌస్‌లో 100 శాతం అఫర్ట్స్ పెట్టి టాస్కులు ఆడినట్లు రేవంత్ చెప్పుకొచ్చాడు.