
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. అయితే ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓటింగ్‌లో టాప్-3లో కొనసాగుతున్న ఇనయాను ఎలిమినేట్ చేసినట్లు గాసిప్ రాయుళ్లు చెప్పుకుంటున్నారు. దీంతో బిగ్‌బాస్ షో అంతా కుట్రేనని ఇనయా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం టిక్కెట్ టు ఫినాలేకు వెళ్లిన శ్రీహాన్ మినహా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. వాస్తవానికి చూసుకుంటే రేవంత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా రోహిత్ అనూహ్యంగా ఓటింగ్‌లో టాప్-2కి దూసుకొచ్చాడు. ఇనయా టాప్-2 నుంచి టాప్-3కి పడిపోయింది. ఇనయా కంటే ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్యలకు ఓటింగ్ తక్కువగా వస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ వారం శ్రీసత్య వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ బిగ్‌బాస్ టీమ్ ఈసారి ఇనయాను పంపించేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇంటి సభ్యులకే కాదు, చూస్తున్న ప్రేక్షకులకు కూడా పెద్ద షాకింగ్ న్యూస్‌గా మారింది. శ్రీసత్యపై వచ్చినంత ట్రోలింగ్స్ ఈ సీజన్లో ఎవరి మీద వచ్చి ఉండవు. శ్రీసత్య అనధికార ఓటింగ్ చూస్తూ చాలా తక్కువే ఉంటుంది. ఇనయా ఓటింగ్‌లో ఆమెకు సగం ఓటింగ్ మాత్రమే పడుతున్నాయి. అయినా కూడా ఇనయా సుల్తానాను ఎలిమినేట్ చేశారు. ఇనయా ఆట ఆడుతోంది, ఓట్లు కూడా పడుతున్నాయి. అయినా ఆమెను ఎందుకు ఎలిమినేట్ చేయాల్సి వచ్చిందో బిగ్‌బాస్ టీమ్‌కే తెలియాలని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌కు పోటీగా విన్నర్ స్థానానికి పోటీ ఇచ్చిన ఇనయా కనీసం టాప్-5లో ఉంటుందని అందరూ అంచనాలు వేసుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి తరహాలో బిగ్‌బాస్ షాకింగ్ ఎలిమినేషన్ చేపట్టాడు.
ఒకవేళ సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లు ఇనయా ఎలిమినేషన్ జరిగితే బిగ్‌బాస్ షో మీద దారుణమైన ట్రోలింగ్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా రెండు వారాలుగా హౌస్‌లో సభ్యులు ఉల్లాసంగా గడుపుతున్నారు. ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ రిలాక్స్ అయ్యారు. మొన్నటి వరకు ఫిట్టింగ్ మాస్టర్ బిగ్ బాస్ ఏదో ఒక టాస్కులు, నామినేషన్లు ఇచ్చి ఆడించారు. చివరి రెండు వారాలు పెద్దగా గొడవలు లేవు. ఇటీవల ఇమిటేషన్ టాస్కులోనూ ఇనయా అదరగొట్టింది. గతంలో ఇంట్లో జరిగిన సంఘటనలను రీక్రియేట్ చేసి, తనను ఎంటర్‌టైన్ చేయమని బిగ్‌బాస్ అడిగాడు. దీంతో శ్రీహాన్, ఇనయా మధ్య జరిగిన పిట్ట గొడవను రీక్రియేట్ చేశారు. ఇందులో శ్రీసత్య ఇనయాగా, రేవంత్ శ్రీహాన్‌గా నటించారు. వీరిద్దరూ ఇరగదీశారు. గీతూలా నటించిన ఇనాయ కూడా చాలా బాగా నవ్వించింది. తరువాత హోటల్ టాస్కులో శ్రీసత్య, అర్జున్ కళ్యాన్ మధ్య కెమిస్ట్రీని రీక్రియేట్ చేశారు. ఇందులో శ్రీహాన్ అర్జున్ కళ్యాణ్‌గా, ఇనాయ శ్రీసత్యగా, శ్రీసత్య సుదీపగా నటించింది. అటు దెయ్యాల గదిలో వెళ్లేందుకు శ్రీసత్య భయపడగా ఇనయా మాత్రం ధైర్యంగా వెళ్లింది.