
తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ ఆరో సీజన్ మధ్యలోనే నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ షో బోరింగ్‌గా కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఈ షోను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటే ఆదేశాలు జారీ చేసింది. గతంలో జరిగిన విచారణలో భాగంగా బిగ్ బాస్ తెలుగు షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్‌లను చూస్తామని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసం స్పష్టం చేసింది. బిగ్ బాస్ యువతను తప్పుదోవ పట్టించడంతోపాటు అసభ్యత, హింసను ప్రోత్సహిస్తోందని.. వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సామాజిక కార్యకర్త కె.జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
బిగ్‌బాస్ కార్యక్రమాన్నిసెన్సార్ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఇలాంటి షోలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో మాటీవీ ఎండీకి కూడా ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అటు బిగ్‌బాస్ షోపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా సీజన్ -6 ఆరంభంలో సీపీఐ నారాయణ బిగ్‌బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. షో ద్వారా అశ్లీలతని ప్రోత్సహిస్తున్నారంటూ ఓ పరుష పదజాలం కూడా వాడాడు. అలానే షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జునను కూడా తిట్టిపోశాడు. కానీ షో నిర్వాహకులు నారాయణ కామెంట్స్‌ని పట్టించుకోలేదు. అలానే నాగార్జునకూడా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న భార్య భర్తలు రోహిత్- మెరీనాని హగ్ చేసుకోండి.. మీకు లైసెన్స్ ఉంది అని చెప్పి.. వాళ్లు హగ్ చేసుకుంటున్నప్పుడు నారాయణ నారాయణ.. వాళ్లిద్దరూ భార్యాభర్తలు అని చెప్తూ పరోక్షంగా నారాయణకు కౌంటరిచ్చాడు.
ప్రస్తుతం బిగ్‌బాస్ షో 8వ వారం కొనసాగుతోంది. ఈ వారం హౌస్ కెప్టెన్‌గా శ్రీహాన్ ఎంపికయ్యాడు. అతడు కెప్టెన్ కుర్చీలో కూర్చోగానే గీతూ విజిల్స్ వేసింది. కుర్చీలో కూర్చోని శ్రీహాన్ మీసం మెలేశాడు. కానీ ఆ ధీరత్వం కెప్టెన్‌గా చూపించలేకపోయాడు. శ్రీసత్యకు, గీతూకు ఫేవర్ చేస్తూ కనిపించాడు. ఇంట్లో వరస్ట్ ఇంటి సభ్యుడిని ఎంచుకోమని బిగ్‌బాస్ చెప్పాడు. దానికి శ్రీహాన్ బాలాదిత్యను ఎంచుకున్నాడు. అతని ముఖానికి ఎర్ర రంగు పూశాడు. నిజానికి ఈ వారం గీతూ వరస్ట్‌గా ఆడింది. నిజానికి ఈ వారం బాలాదిత్య గేమ్ చాలా బాగా ఆడాడు. కేవలం గీతూ, శ్రీ సత్యకు నచ్చని కారణంగానే శ్రీహాన్ అతడిని వరస్ట్ ఇంటి సభ్యుడిగా ఎంచుకున్నాడు. మొదటి రౌండ్‌లోనే ఓడిపోయిన గీతూ పెద్దగా ఈవారం ఏమీ ఆడని ఆదిరెడ్డి అతనికి కనిపించలేదు. ఒక చేపను మీరు సూర్యకు ఇచ్చేశారంటూ బాలాదిత్యను నామినేట్ చేశాడు. చివరికి బాలాదిత్యను జైల్లో వేశాడు శ్రీహాన్. గీతూకి ఇంట్లో ఫస్ట్ టార్గెట్ రేవంత్, రెండో టార్గెట్ బాలాదిత్య. వీళ్లిద్దరినీ హౌస్ నుంచి బయటకు పంపడమే గీతూ టార్గెట్‌లా కనిపిస్తోంది. గీతూ పద్దతులు బాగోలేక పోయినా ఆమెతోనే ఆదిరెడ్డి ఉండటం పలువురికి అంతుబట్టడం లేదు.