
బిగ్‌బాస్ 6 ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. అయితే అంచనాలకు భిన్నంగా ఫినాలే సాగింది. నాటకీయ పరిమాణాల కారణంగా విన్నర్ రేవంత్ కంటే రన్నరప్ శ్రీహాన్ అత్యధిక క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. రేవంత్ రూ.10 లక్షల నగదు మాత్రమే గెలుచుకోగా శ్రీహాన్ మాత్రం రూ.40 లక్షల నగదు సొంతం చేసుకున్నాడు. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవ్వగా చివరిగా రేవంత్, శ్రీహాన్ మిగిలారు. వారి ముందు రూ. 40 లక్షల టెంప్టింగ్ ఆఫర్‌ను హోస్ట్ నాగార్జున ఉంచారు. శ్రీహాన్‌ను ఎక్స్ కంటెస్టెంట్స్ ఒపినీయన్ తీసుకోమన్నారు. చివరిగా శ్రీహాన్ తల్లిదండ్రులు ఆ ఆఫర్‌ను తీసుకోమ్మని చెప్పడంతో శ్రీహాన్ రూ.40 లక్షల ఆఫర్‌ను అంగీకరించాడు. అయితే ఓట్ల పరంగా శ్రీహాన్ విజేతగా నిలిచాడు. కానీ అతడు ఆఫర్‌ను అంగీకరించడంతో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు విన్నర్‌కు సువర్ణ భూమి వారు ఫ్లాట్ ఉచితంగా ఇవ్వగా శ్రీహాన్‌కు 50 శాతం డిస్కౌంట్‌తో అందజేస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో శ్రీహాన్ నక్క తోకను తొక్కాడని అభిమానులు భావిస్తున్నారు.
అయితే తాను సొంతం చేసుకున్న రూ.40 లక్షల ప్రైజ్ మనీతో ఇల్లు కొనుగోలు చేయనున్నట్లు శ్రీహాన్ వెల్లడించాడు. ఇప్పటికే తనకు సువర్ణభూమి వారు 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో క్యాష్ ప్రైజ్‌తో అక్కడ ఫ్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఇల్లు కట్టుకున్న తర్వాత శ్రీహాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటాడా లేదా సిరి, కొడుకుతో కలిసి జీవిస్తాడా అన్న విషయం తేలాల్సి ఉంది. ఒకరకంగా రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అని చెప్పుకోవడం తప్పితే.. ఆ ట్రోఫీ చూసినప్పడల్లా శ్రీహాన్ గుర్తొచ్చేట్టుగా బిగ్‌బాస్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇవ్వడం రేవంత్ అభిమానులకు నచ్చడం లేదు. ఒకరకంగా ఇద్దరూ విజేతలే అని నాగ్ చెప్పడం సీజన్ మొత్తానికే కొసమెరుపుగా నిలిచింది. అయితే ఒక సీజన్లో ఇద్దరు విజేతల్ని ప్రకటించడం తెలుగులోనే కాదు.. దేశంలోనే ఇదే తొలిసారి. ఈ దేశంలో జరిగిన 28 సీజన్స్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదు. సీజన్‌కు ఇద్దరు విన్నర్స్.. శ్రీహాన్‌కి రూ.40 లక్షల ప్రైజ్ మనీ వస్తే.. విన్నర్ ట్రోఫీ రేవంత్ తీసుకున్నాడు.
రేవంత్ కంటే నీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి అని స్టేజీపై నాగార్జున చెప్పగానే శ్రీహాన్ పట్టరాని ఆనందంతో పొంగిపోయాడు. ఇది చాలు అంటూ అతడు ఎమోషనల్ అయ్యాడు. అయితే అంతకుముందు రేవంత్ విన్నింగ్ ట్రోఫీ తీసుకున్నప్పుడు.. శ్రీహాన్‌ని పిలిచి ట్రోఫీ పట్టుకోమని చెప్పాడు. ఇద్దరం విన్నర్స్ అని నాగార్జున సార్ చెప్పారు కద అని అన్నాడు. కానీ శ్రీహాన్‌నే రియల్ విన్నర్ అని చివర్లో ట్విస్ట్ ఇవ్వడంతో రేవంత్ నోట మాటరాలేదు. డబ్బుది ఏముంది.. రూ.40 లక్షలు పోయినా.. సువర్ణభూమి వారి ప్లాట్ అయినా మిగిలింది అనుకుంటే.. ఆ విషయంలో కూడా రేవంత్‌కు సువర్ణభూమి నిర్వాహకులు సంతోషం లేకుండా చేశారు. రన్నర్‌కు కూడా సువర్ణభూమి ప్లాట్‌ని 50 పర్సంట్ ఆఫర్‌కు ఇస్తామని వేదికపైనే ప్రకటించారు. కాగా ఈ షో ముగిసిన తర్వాత శ్రీహాన్ బీబీ కేఫ్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. శ్రీసత్య, నువ్వు అన్నాచెల్లెళ్లుగా ఉన్నారా అని యాంకర్ శివ అడగ్గా శ్రీహాన్ హేయ్ అంటూ ఆపబోయాడు. దీంతో సిరి చూశావా అంటూ శ్రీహాన్‌ను బుక్ చేద్దామని యాంకర్ శివ ప్రయత్నించాడు.