
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనకు హిందీలో కూడా భారీ ఫాలోయింగ్ ఉందని గాడ్ ఫాదర్ మూవీ చాటిచెప్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ నటించినా కొన్ని నిమిషాలు మాత్రమే ఆ పాత్ర ఉంటుంది. సల్మాన్ వల్ల బాలీవుడ్‌లో గాడ్ ఫాదర్ మూవీకి వసూళ్లు వచ్చినట్లు భావిస్తే పప్పులో కాలేసినట్లే. కంటెంట్ ఉంటే ఏ మూవీనైనా తాము చూస్తామని ఇటీవల కాలంలో బాలీవుడ్ ఆడియన్స్ చాటిచెప్తున్నారు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా కావడంతోనే ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విడుదలైన 10 రోజులకే ఈ మూవీ బాలీవుడ్‌లో రూ.15 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలిపారు. ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ.20 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2019లో విడుదలైన మలయాళ చిత్రం లూసీఫర్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారిగా నటించిన చిత్రమిది. చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్ నటించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఒరిజినల్ కంటెంట్ కంటే బాగుందనే టాక్ తెచ్చుకుంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా త్వరలో తమిళంలో సైతం విడుదల కానుంది. గాడ్ ఫాదర్ సినిమాకు బాలీవుడ్‌లో అంతకంతకూ ఆదరణ పెరిగిపోతోంది. ఫలితంగా ఉత్తరాదిన ఈ సినిమా విడుదలైన థియేటర్ల సంఖ్య 600కు పెరిగింది. హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేదను కాదని చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు స్క్రీన్లు భారీగా పెంచడం ఉత్తరాదిలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో టాలీవుడ్ ఆధిపత్యం పెరుగుతోందనేది గాడ్ ఫాదర్ సినిమాతో మరోసారి రుజువైంది.
హీరోయిన్, డ్యూయట్స్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రయోగం గాడ్ ఫాదర్ మూవీ. సత్యదేవ్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. బ్రహ్మ పాత్రలో చిరు నటన హైలెట్‌గా నిలిచింది. తమన్ సంగీతం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ మూవీలో నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిరు చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా రీమేక్ సినిమా అయినా కూడా చాలా మార్పులు చేసి దర్శకుడు మోహన్ రాజా ఇంట్రెస్టింగ్‌గా పాత్రలను మలిచాడు. గాడ్ ఫాదర్ మూవీకి నార్త్‌లో వచ్చిన బాక్సాఫీసు కలెక్షన్స్‌లో మేజర్ పార్ట్ ఈస్ట్ పంజాబ్ నుంచి ఉంది. 11 శాతం వసూళ్లు అక్కడి నుంచే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సాధారణంగా సౌత్ సినిమాలకు అక్కడ 6 శాతమే ఇప్పటి వరకు అధికం అని అంటున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీకి 11 శాతం రావడం విశేషం.