
తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎప్పుడూ రికార్డులు, ప్రశంసలే కాదు.. అప్పుడప్పుడు వివాదాలు కూడా ఉంటాయి. ఈ సంక్రాంతి బరిలో వచ్చిన రెండు పెద్ద సినిమాలు భారీ హిట్ అయ్యాయి. నందమూరి బాలయ్య హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి, చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకెళుతున్నాయి. ఇందులో వీరసింహారెడ్డి సినిమా యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ దాదాపు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్ ఇస్తున్న సమయంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాత, దర్శకులతో పాటు గెస్టులుగా వచ్చిన ఇతర హీరోలు, దర్శకులు సైతం వేదికపై ఉన్నారు. అయితే ఆర్టిస్టులను టెక్నీషియన్లను అందరినీ అభినందించిన తర్వాత నిర్మాతలను, కొందరు నటులను అభినందించే సమయంలో అందరూ అద్భుతంగా నటించారని బాలయ్య చెప్పాడు.
అటు కొందరు నటులతో తనకు చక్కని టైంపాస్ అయిందని చెప్తూ.. నాన్న గారి డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంటూ అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం అంటూ బాలయ్య కామెంట్ చేశాడు. పాతకాలం నటులను, ఆ డైలాగులను నెమరు వేసుకునే సంగతి మంచిదే అయినా.. బాలయ్య మాట్లాడుతున్న ఫ్లోలో అక్కినేని.. తొక్కినేని అనడం వివాదాస్పదంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించాడు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు తల్లి కళామతల్లి ముద్దుబిడ్డలు అని.. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టునే హీరో అఖిల్ కూడా షేర్ చేశాడు. అయితే నాగచైతన్య చేసిన ట్వీట్ పై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
కాగా సీనియర్ హీరో బాలయ్య అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గౌరవంతో పాటు భయం కూడా ఉంది. ఆయన సినిమాలు ఆయనకు ఎంతో గుర్తింపు తెస్తే.. ఆయన చేసే చేష్టలు, మాటలు అంతకన్నా గుర్తింపును తెస్తున్నాయి. మీడియా ముందు, సభల్లో చాలాసేపు ఊదరగొట్టి.. పసలేని మాటలు చెప్పే బాలయ్య.. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య మాట్లాడుతూ అసందర్భంగా అక్కినేని తొక్కినేని అని సంభోదించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 60 సంవత్సరాల పైబడిన నందమూరి బాలయ్య తన వయసులో సగం కూడా లేని అక్కినేని హీరోల చేత ఇలా మాటలు పడాల్సి రావడం నిజంగా దురదృష్టకరం అని సగటు అభిమానులందరూ బాధను వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదని, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మర్యాద కాదు అని సలహా ఇస్తున్నారు.