
నందమూరి బాలకృష్ణ వెండితెరపైనే కాకుండా ఓటీటీ వేదికపైనా తనదైన శైలిలో అదరగొట్టేశారు. ఆహా ఓటీటీలో ఆయన చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. టాక్ షోలకు రావడానికే ఆలోచించే బాలకృష్ణ ఏకంగా టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ షో ద్వారా సెలబ్రిటీలతో బాలయ్య బాబు చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో చాలా మంది బాలయ్యది చిన్న పిల్లాడి మనస్థత్వం అని అనుకుంటారు. కానీ ఈ షోతో బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూశారు. బాలయ్య ఎంత సరదా మనిషో ఈ షో ద్వారా చాలా మంది ప్రేక్షకులకు తెలిసొచ్చింది. బాలయ్య అంటే కోపం ఒక్కటే కాదని.. ఆయనలో చమత్కారం కోణం కూడా ఉంటుందని ఈ షో ద్వారా వెల్లడైంది.
ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 వచ్చేస్తోంది. త్వరలోనే సెకండ్ సీజన్ ప్రారంభం కానుంది. ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా రెండో సీజన్‌ను నిర్వాహకులు గ్రాండియర్‌గా ప్లాన్ చేశారు. తొలి సీజన్‌కు పనిచేసిన రైటింగ్ టీమ్ సీజన్ 2 కోసం కూడా పని చేస్తోంది. ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈనెల 4న విజయవాడలో అభిమానుల సమక్షంలో సెకండ్ సీజన్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. సెకండ్ సీజన్‌లో చంద్రబాబు-లోకేష్, త్రివిక్రమ్-పవన్ ఇలాంటి కాంబినేషన్లు సెట్ చేసేందుకు టీమ్ ప్రయత్నిస్తోంది. తొలి ఎపిసోడ్‌గా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ అవుతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దాదాపు 30 వేల మంది సమక్షంలో జరగబోయే ఈ వేడుక కోసం బాలకృష్ణ ప్రైవేట్ జెట్‌లో 4వ తేదీ ఉదయం విజయవాడ వెళుతున్నారు. అయితే ఈ ఈవెంట్ పాస్‌ల కోసం అభిమానుల తాకిడి తట్టుకోలేక పోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
అటు టోటల్ ఈవెంట్ ప్లాన్ కూడా పకడ్బందీగా డిజైన్ చేశారు. బాలయ్య పాటల హంగామాతో పాటు ఇండియన్ ఐడల్ సింగర్స్ పాటలు, బాలకృష్ణ పాటలతో మెడ్లీ, బాలకృష్ణ పాటల క్విజ్, సీజన్ వన్ హైలైట్స్, దసరా సందర్భంగా బాలకృష్ణ, అల్లు అరవింద్ చేతుల మీదుగా రావణ దహనం వంటి అంశాలు ఈ ఈవెంట్ లో చోటుచేసుకోనున్నాయి. అన్‌స్టాపబుల్ సీజన్ 2 తో మరిన్ని సబ్‌స్క్రిప్షన్‌లు నమోదవుతాయని ఆహా ఓటీటీ ఆశిస్తోంది. ఇటీవల సినిమాలతో రాని సబ్‌స్క్రైబర్లు ఈ షోతో వస్తారని విశ్వసిస్తోంది. అటు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, అనుష్క వంటి బడా స్టార్లు కూడా సీజన్ 2లో వస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి బాలయ్య వీరిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం ఇప్పటినుంచే ఆసక్తి రేపుతోంది. కాగా బాలయ్య బాబుతో కలిసి పని చేయడం ఒక అద్భుతం అని చెప్పిన ప్రశాంత్ వర్మ.. ఈ సీజన్‌ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించడం మరిన్ని అంచనాలను పెంచుతోంది. గతంలో అ’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి చిత్రాలను ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు.