
వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. ముఖ్యంగా బాలయ్య తన ప్రసంగంలో ఫ్లోలో మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అని కామెంట్ చేయడం అక్కినేని అభిమానులను తీవ్రంగా ఆవేదనకు గురిచేసింది. దీంతో బాలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని పలువురు డిమాండ్ చేశారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని మనవళ్లు నాగచైతన్య, అఖిల్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు అని.. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం అంటూ చైతూ ఓ నోట్‌ను విడుదల చేశాడు. ఈ నోట్‌ను అఖిల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై నాగార్జున మాత్రం నోరు మెదపలేదని అక్కినేని అభిమానులు ఫీలయ్యారు. తాజాగా బాలయ్య కామెంట్లపై నాగార్జున కూడా రియాక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలపై తాను స్పందించనని నాగార్జున చెప్పాడంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈ అంశంపై బాలయ్య కూడా స్పందించాడు. హిందూపురంలో పర్యటిస్తున్న సమయంలో తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండటాన్ని బాలయ్య ఖండించాడు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ రెండు కళ్లలాంటివారు అని.. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అనే విషయాన్ని నేర్చుకున్నానని.. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సంబంధం లేదని బాలయ్య స్పష్టం చేశాడు. అక్కినేని నాగేశ్వరరావు తనకు బాబాయ్ లాంటి వాడు అని.. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారని వెల్లడించాడు. అప్యాయత అక్కడ లేదని.. ఇక్కడ ఉందని.. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగిందని బాలయ్య గుర్తుచేశాడు. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుందని.. బయట ఏం జరిగినా తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాలయ్య అభిప్రాయపడ్డాడు.
అయితే బాలయ్య, అక్కినేని వివాదాన్ని ఏపీలోని అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. టీడీపీకి వ్యతిరేకంగా ఆ పార్టీకి బాలయ్యను దూరం చేసేలా వైసీపీ కుట్రలు పన్నుతోందని విమర్శలు చెలరేగాయి. నాగచైతన్య సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా రీచ్ సరిగ్గా రాదని.. కానీ బాలయ్యను ఉద్దేశిస్తూ చైతూ పెట్టిన పోస్ట్ విపరీతంగా వైరల్ కావడానికి కారణంగా వైసీపీకి చెందిన ఐప్యాక్ టీమ్ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఐ ప్యాక్ వాళ్లు ఓ స్ట్రాటజీ ప్రకారమే ఈ అంశాన్ని లేవనెత్తారని.. దీంతో బాలయ్య వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని తెలుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే మరోవైపు బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. వీర సింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా అయ్యిందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా విషయంలో ఓ కీలక విషయం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు దాదాపుగా రాయలసీమ నేపథ్యంలోనే సాగేవి. అయితే ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో రానుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించాడు.