
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్‌బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమాను రి రిలీజ్ చేశారు. దాదాపు 370కి పైగా షోలను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించి నానా హంగామా సృష్టించారు. కట్ చేస్తే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సమీపిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని పవర్‌స్టార్ అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది తమ అభిమాన నటుడి బర్త్ డేను మరింత స్పెషల్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జల్సా మూవీ స్పెషల్ షోలను భారీ ఎత్తున ప్రదర్శించాలని పవన్ అభిమానులు తలపెట్టారు. 2008లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీని తాజాగా 4కే ఆల్ట్రా హెచ్డీ క్వాలిటీలోకి మార్చడమే కాకుండా డాల్బీ ఎట్మాస్ సౌండ్‌ను జోడిస్తున్నారు. దీంతో జల్సా మూవీని మరోసారి వీక్షించాలని పవర్ స్టార్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. జల్సా మూవీ దాదాపు 500 షోలు పడనున్నట్లు టాక్ నడుస్తోంది.
త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా జల్సా. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వరుస ప్లాపులలో ఉన్న పవన్ కళ్యాణ్‌ను త్రివిక్రమ్ ఈ సినిమాతో గట్టెక్కించాడు. ఇక ఈ చిత్రంలో సంజయ్ సాహూ గా పవన్ మాస్ యాక్టింగ్ అభిమానులను పిచ్చెక్కించిందని చెప్పాలి. ముఖ్యంగా పవన్- బ్రహ్మానందం కామెడీకి ఇప్పటికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీలో పార్వతి మెల్టన్ మరో హీరోయిన్గా నటించింది. పవన్ బర్త్ డే సందర్భంగా జల్సా సినిమాను కనీవినీ ఎరుగని రీతిలో ప్రదర్శించి రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాలని పవన్ అభిమానులు టార్గెట్ పెట్టుకున్నట్లు ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు గీతా ఆర్ట్స్ బ్యానర్ వాళ్లు థియేటర్లను ఎరేంజ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. విచిత్రం ఏంటంటే.. ఇటీవల మహేష్ బర్త్ డే సందర్భంగా ప్రదర్శించిన పోకిరి మూవీలో హీరోయిన్ ఇలియానా కాగా.. ఇప్పుడు పవన్ బర్త్ డే సందర్భంగా ప్రదర్శించనున్న జల్సా మూవీలోనూ ప్రధాన కథానాయిక ఇలియానానే కావడం విశేషమని అభిమానులు భావిస్తున్నారు.
అటు జల్సా సినిమాలో మహేష్ బాబు స్పెషల్‌గా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. జల్సా మూవీని మహేష్ వాయిస్ ఓవర్ ముందుకు తీసుకువెళ్తుంది. అలా అటు పవర్‌స్టార్, ఇటు సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమాను మరోసారి వీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఈ సినిమా రీ రిలీజ్ కారణంగా థియేటర్ ఓనర్స్ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటున్నారు. పోకిరి సినిమాకు మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో రచ్చ చేశారు. పలు చోట్ల తెరలను చింపేసి కుర్చీలను విరగకొట్టి నానా హంగామా చేశారు. ఇక పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో రచ్చ చేస్తారో అని థియేటర్ ఓనర్స్ భయపడుతున్నారు. ఇప్పటికే కాకినాడలో థియేటర్ల యాజమాన్యాలు స్పెషల్ షోలను రద్దు చేసి అభిమానులకు షాకిచ్చాయి. జల్సా మూవీ స్పెషల్ షోల నేపథ్యంలో అభిమానులు ఇప్పటి నుంచే హంగామాకు తెరతీశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులతో వైరల్ చేస్తున్నారు. #SanjaySahuArrivingSoon హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. బాబు కొత్తగా కొన్న అద్దంలా మెరిసిపోతున్నాడు. కొత్త ప్రింట్లో సౌండ్ క్వాలిటీ అమెజింగ్. సెలబ్రేషన్స్ మొదలుపెట్టండి. షోలు, పబ్లిసిటీ అంతా సీనియర్స్ ఫ్యాన్స్ ఆర్గనైజ్ చేస్తారంటూ దర్శకనిర్మాత సాయి రాజేష్ పెట్టిన పోస్ట్ పవన్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.