
టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో బండ్ల గణేష్ కూడా ఉంటాడు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్‌షా, టెంపర్, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే వంటి పలు భారీ బడ్జెట్ సినిమాలను బండ్ల గణేష్ తన బ్యానర్‌పై నిర్మించాడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్‌కు పిచ్చి. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినా బండ్ల గణేష్ అక్కడ వాలిపోతుంటాడు. కానీ భీమ్లా నాయక్ ఫంక్షన్‌కు బండ్లకు ఆహ్వానం లభించలేదు. త్రివిక్రమ్‌తో విభేదాలే దీనికి కారణమని చర్చ కూడా జరిగింది. అయితే తాజాగా ఆయన ఆకాష్ పూరీ నటించిన చోర్ బజార్ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ పైనే బండ్ల గణేష్ విమర్శలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
ఎంతోమంది నార్మల్ స్టార్లను సూపర్ స్టార్లుగా చేశావు.. కానీ నీ సొంత కొడుకు విషయానికి వచ్చేసరికి నువ్వు కనిపించడం లేదు. నీ కొడుకు సినిమా ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ఫ్లైట్ ఎక్కి రాకుండా ముంబైలో ఏం చేస్తున్నావు? అంటూ పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పూరీ భార్య లావణ్య రామాయణంలో సీత వంటిది అని అభిప్రాయపడ్డాడు. ఆమె ఒక ఆదర్శవంతమైన భార్య, చెల్లెలు, కోడలు అని అభివర్ణించాడు. పూరీ జగన్నాథ్‌ను అన్నయ్య అని.. ఆయన భార్య లావణ్యను వదిన అంటూ బండ్ల గణేష్ ఆప్యాయంగా పిలుస్తూ వారి కుటుంబానికి బండ్ల గణేష్ సన్నిహితంగా ఉంటుంటాడు. ఈ సందర్భంగా తన వదిన లావణ్య భరతమాత కంటే పవిత్రమైనది, గొప్పది అంటూ చోర్ బజార్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించాడు. తన లాంటి వాడిని ఒక స్టార్ నిర్మాతగా మార్చావు కానీ నీ కొడుకుని మాత్రం స్టార్‌గా మార్చలేకపోతున్నావు. ఏదేమైనా ఆకాష్ నువ్వు మాత్రం సూపర్ స్టార్ అవుతావు. అన్నా నీ కొడుకు డేట్ల కోసం నువ్వు లైన్‌లో నిలబడే రోజు కూడా వస్తుంది. అప్పుడు నీకు డేట్లు ఇవ్వద్దని ఆకాష్‌తో చెప్తానని బండ్ల గణేష్ అన్నాడు. దీంతో టాలీవుడ్‌లో కొద్దిరోజులుగా బండ్ల వ్యాఖ్యలపై హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది.
తాజాగా బండ్ల గణేష్‌ను ఉద్దేశించి పూరీ జగన్నాథ్ చేసిన కామెంట్లు కూడా ఆసక్తి రేపుతున్నాయి. తాను తన సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్నానని.. కొడుకు నటించే ప్రతి సినిమాకు తండ్రి ప్రమోషన్ చేయాలని రూల్ లేదుగా అని పూరీ జగన్నాథ్ అన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున తమ కుమారుల ప్రతి సినిమాకు ప్రమోషన్ చేశారా అని పూరీ ప్రశ్నిస్తున్నాడు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదంటూ బండ్లకు వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అటు పూరీ మ్యూజింగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పూరీ జగన్నాథ్ ఓ షార్ట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో పూరీ జగన్నాథ్ మన నాలుక కదులుతున్న సమయంలో మనం ఏమీ నేర్చుకోలేమన్నాడు. కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, ఆఫీస్ మెంబర్స్ అయినా, భార్య అయినా ఆచితూచి మాట్లాడాలని చీప్‌గా వాగొద్దని పూరీ ఫైర్ అయ్యాడు. అంతేకానీ చీప్‌గా వాగొద్దని, చీప్‌గా ప్రవర్తించొద్దని హితవు పలికాడు. మన కెరీర్, క్రెడిబిలిటీని వాగుడు డిసైడ్ చేస్తుందని పూరీ జగన్నాథ్ అభిప్రాయపడ్డాడు. తప్పు మాట్లాడటంతో పోలిస్తే నాలుకను కొరికేసుకోవడమే తన దృష్టిలో మంచిదని వీడియోలో పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. నీ జీవితం.. నీ చావు నాలుకపైనే ఆధారపడి ఉంటుందన్నాడు. ఈ వ్యాఖ్యలన్నీ బండ్ల గణేష్‌ను ఉద్దేశించి చెప్పినవే అని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు.