
సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించే సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే చాన్నాళ్ల తర్వాత మహేష్‌బాబు దర్శకుడు త్రివిక్రమ్‌తో పనిచేయబోతున్నాడు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాలేదు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇటీవల కుటుంబంతో కలిసి జర్మనీ వెకేషన్‌కు వెళ్లిన మహేష్‌బాబును త్రివిక్రమ్ కలిసి స్టోరీ చెప్పగా మహేష్ ఒకే అనడంతో షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జూలై నుంచి ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ మూవీ కోసం పూజా హెగ్డే డిమాండ్ చేస్తున్న పారితోషికం నిర్మాతలకు షాకిస్తోందని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా చేయాలంటే తనకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని పూజాహెగ్గే పట్టుబడుతున్నట్లు టాక్ నడుస్తోంది. పూజా హెగ్డే పారితోషికం రూ.4 కోట్లు కాగా ఆమె పర్సనల్ స్టాఫ్ ఖర్చులకు రూ.కోటి కలుపుకుని మొత్తం రూ.5 కోట్లు సమర్పించుకోవాల్సి ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో ఆమె బదులు వేరే హీరోయిన్‌ను తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహేష్, త్రివిక్రమ్ సినిమాలో పూజాహెగ్డే స్థానంలో ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకోవాలని సన్నాహాలు జరుపుతున్నారట. అయితే ఈ వార్త పూజాహెగ్డే చెవిన పడటంతో ఆమె సీరియస్‌గా ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు టాలీవుడ్‌లో కేవలం పర్సనల్ స్టాఫ్ కోసం పెద్ద స్థాయిలో ఖర్చు చేస్తున్న హీరోయిన్ పూజాహెగ్డే మాత్రమే అని వదంతులు కూడా వినిపిస్తున్నాయి.
మరో విషయం ఏంటంటే పూజా హెగ్డే సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర బక్కెట్ తన్నేస్తుండటంతో హీరోయిన్‌ను మార్చాలని హీరో మహేష్ కూడా సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో పూజాహెగ్డేకు కొంచెం డిమాండ్ తగ్గిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం వరకు గోల్డెన్ లెగ్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పూజా హెగ్డే క్రమంగా ఆ ఇమేజ్‌ను కోల్పోతుందని అభిమానులే కామెంట్ చేస్తున్నారు. మరోవైపు మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంగీత దర్శకుడి విషయంలోనూ తర్జన భర్జనలు నడుస్తున్నాయి. తొలుత ఈ సినిమాకు తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. అయితే సర్కారు వారి పాట బీజీఎం విషయంలో మహేష్ అసంతృప్తిగా ఉన్నాడని.. అందువల్ల త్రివిక్రమ్ సినిమాకు అనిరుధ్ లేదా దేవిశ్రీప్రసాద్‌లను తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే మాత్రం తమన్‌నే కొనసాగిస్తారని.. తమన్ ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఛార్ట్ బస్టర్ సాంగ్స్ ఇస్తాడని అతడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.