
టాలీవుడ్లో గంభీరంగా వినిపించే వాయిస్ మూగబోయింది. టాలీవుడ్ సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కను కోల్పోయింది. ఇప్పటికే దాసరి నారాయణరావు మరణం తర్వాత పెద్ద దిక్కు లేదని ఆవేదన చెందుతున్న తెలుగు చిత్ర సీమలో ఇప్పుడు కృష్ణంరాజు మరణం తీరని లోటుగా కనిపిస్తోంది. పౌరాణిక, ఫ్యామిలీ సినిమాలతో కృష్ణంరాజు తనదైన ముద్ర వేసుకున్నారు. పౌరాణికాలలో ఎన్టీఆర్, సాంఘికాలలో ఏఎన్నార్ అభినయం అంటే కృష్ణంరాజుకు ఎంతో అభిమానం. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణునిగా తెరపై చూడడమంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆరడుగుల ఎత్తున ఉన్న కృష్ణంరాజు చూపరులను ఇట్టే ఆకట్టుకొనేవారు. అందువల్ల కృష్ణంరాజుకు తగ్గ పాత్రలు తన చిత్రాలలో ఏవైనా ఉంటే ఎన్టీఆర్ తప్పకుండా ఇప్పించేవారు. అలా ఎన్టీఆర్‌తో కలిసి కృష్ణంరాజు భలే మాస్టర్, బడిపంతులు, మనుషుల్లో దేవుడు, మంచికి మరోపేరు, పల్లెటూరి చిన్నోడు, వాడే-వీడు, సతీసావిత్రి వంటి చిత్రాలలో నటించారు.
ఎన్టీఆర్ తరువాత కొన్ని పాత్రలకు కృష్ణంరాజు మాత్రమే న్యాయం చేయగలరని అప్పటి రచయితలు, దర్శకులు నిర్ణయించారు. అలా రూపొందిన బొబ్బిలి బ్రహ్మన్నచిత్రంతో కృష్ణంరాజు జేజేలు అందుకున్నారు. తాండ్ర పాపారాయుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి పాత్రల్లోనూ నటించి అలరించారు. ఇటీవల ఎవడే సుబ్రహ్మణ్యం, రాధేశ్యామ్ వంటి చిత్రాలలో కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. ఆయన నటించిన పాత్రలలో ఎవరినీ ఊహించుకోలేం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కృష్ణంరాజు పార్ధివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. చిరంజీవి, మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, గోపీచంద్, నాగార్జున వంటి ప్రముఖులు తమ అశ్రునయనాలతో సంతాపం తెలిపారు. అయితే కృష్ణంరాజు భార్య గుండెలు పగిలేలా రోధిస్తుండటం పలువురిని కంటతడి పెట్టించింది. కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కృష్ణంరాజు వ్యక్తిగత జీవితంలో రెండు వివాహాలు చేసుకున్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి అని చాలా తక్కువ మందికి తెలుసు. తొలి భార్య సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఓ కుమార్తె పుట్టింది. 1995లో అనుకోకుండా ఒక కారు ప్రమాదంలో సీతాదేవి మరణించింది. ఆ సమయంలో కృష్ణంరాజు సీతాదేవిని మర్చిపోలేక కొన్ని సంవత్సరాల పాటు చాలా డిప్రెషన్లోకి వెళ్లారు. అలా కృష్ణంరాజును చూసిన బంధువులు తను ఈ బాధ నుంచి బయటపడడానికి రెండో వివాహం చేసుకోమని సలహా ఇచ్చారు. అయితే మొదట కృష్ణంరాజు రెండో వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ బంధువుల సలహా మేరకు రెండో వివాహం చేసుకున్నారు. అలా శ్యామలాదేవిని కృష్ణంరాజు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కూడా జన్మించారు. ఇక వీరితో పాటు మరొక అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. అలా మొదటి భార్య మరణం తర్వాత రెబల్ స్టార్ రెండో వివాహం చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణం రాజు మృతికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.