
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఇండియాలోనే మన సినిమాలకు మంచి బిజినెస్ జరిగేది. కానీ బాహుబలి చిత్రం తర్వాత ఓవర్సీస్‌లోనూ టాలీవుడ్ చిత్రాలకు మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ సినిమాల కంటే టాలీవుడ్ సినిమాలకు మంచి కలెక్షన్‌లు రావడం అనూహ్య పరిణామం అనే చెప్పాలి. ఇక టాలీవుడ్‌లో బడా హీరో సినిమా విడుదలైతే ఆ రచ్చే వేరుగా ఉంటోంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఫస్ట్ వీకెండ్‌లో భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఆర్.ఆర్.ఆర్ సినిమా అయితే ఓవర్సీస్‌లో దుమ్ముదులుపుతోంది. ఈ మూవీతో పాటు కేజీఎఫ్-2 మూవీ కూడా పోటాపోటీగా వసూళ్లు దక్కించుకుంటోంది. మెగాస్టార్ మూవీ ఆచార్య కూడా తొలుత బాగానే వసూళ్లు తెచ్చుకుంది. కానీ బ్యాడ్ టాక్ రావడంతో తొలిరోజే చతికిలపడిపోయింది.
ఓవర్సీస్‌లో ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల వసూళ్లను పరిశీలిస్తే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ తొలివారం అక్కడ రూ.17.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ కూడా ఓవర్సీస్‌లో అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఈ మూవీ తొలివారం రూ.15 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిర రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా తొలివారం రూ.13 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు తెచ్చుకుంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా అయితే ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓవర్సీస్‌లో తొలివారం రూ.68 కోట్లు రాబట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించడం, రాజమౌళి సినిమాలకు ఓవర్సీస్‌లో పెద్ద మార్కెట్ ఉండటం ఈ చిత్రానికి కలిసొచ్చింది. దీంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లు రెండింతలు లాభపడినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో తొలివారం వసూళ్లలో టాప్-1 సినిమా నిస్సందేహంగా ఆర్.ఆర్.ఆర్ మూవీనే.
మరోవైపు యష్ హీరోగా నటించిన కేజీఎఫ్-2 మూవీ సైతం ఆర్.ఆర్.ఆర్‌కు పోటీ ఇచ్చింది. కేజీఎఫ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో సీక్వెల్ మూవీ కూడా వసూళ్ల మోత మోగించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓవర్సీస్‌లో తొలివారం రూ.15.7 కోట్లు రాబట్టింది. అయితే ఇటీవల విడుదలైన ఆచార్య మిలియన్ డాలర్లు కూడా సంపాదించలేకపోయింది. 8 లక్షల డాలర్ల వద్దే ఈ మూవీ వసూళ్లు నిలిచిపోయాయి. తొలుత ఓవర్సీస్‌లో ఆల్‌టైం హయ్యెస్ట్ వసూళ్లు అందుకున్న టాప్-10 మూవీస్‌లో ఆచార్య ఎంటర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఆచార్య ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అటు ఓవర్సీస్‌లో బాలీవుడ్ మూవీ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం తొలివారంలో రూ.11.4 కోట్లు అంటే.. 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లను రాబట్టింది. యూకేలో ఈ చిత్రం 160కే అమెరికన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 262కే అమెరికన్ డాలర్లు రాబట్టింది. గతంలో ఏ భారతీయ సినిమాకు దక్కని విధంగా ఆస్ట్రేలియాలోని గెరాల్డ్‌టన్, బన్‌బురీ, పోర్ట్ హెడ్‌లాండ్ లాంటి నగరాల్లో భారీ సంఖ్యలో చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించినట్లు సమాచారం.