
టాలీవుడ్‌లో అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి అతడు అడుగుపెట్టడంతో అతడి సినిమాలపై మంచి బజ్ ఏర్పడేది. అటు అల్లు కుటుంబం, ఇటు మెగా కుటుంబ అభిమానులు అండగా ఉండటంతో మొదట్లో వరుసగా సినిమా అవకాశాలు అల్లు శిరీష్‌ను వరించాయి. అల్లు శిరీష్ భానుమతి దర్శకత్వం వహించిన తమిళ సీరియల్‌లో తొలుత బాలనటుడిగా నటించాడు. తన సోదరుడు అల్లు అర్జున్ నటన, రామ్‌చరణ్ నటన ప్రభావంతో తెలుగు సినిమా రంగంలోకి అరంగేట్రం చేశాడు. 2013లో గౌరవం అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మారుతి దర్శకత్వం వహించిన కొత్త జంట సినిమాతో విజయం సాధించాడు. ఆ తర్వాత శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా మంచి పేరునే సంపాదించిపెట్టింది. అయితే ఆ తర్వాత అల్లు శిరీష్ సినిమాలను సరిగ్గా సెలక్ట్ చేసుకోలేకపోవడం అతడికి మైనస్‌గా మారింది. ఒక్క క్షణం, ఏబీసీడీ, 1971 వంటి సినిమాలు అతడి కెరీర్‌కు ఏ రకంగానూ ఉపయోగపడలేదు.
అల్లు అరవింద్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ కుమారుడి ట్యాగ్ ఉండి కూడా అల్లు శిరీష్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు వ్యక్తిగత జీవితంపైనే అల్లు శిరీష్ దృష్టి పెట్టినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఏబీసీడీ వంటి డిజాస్టర్ తర్వాత శిరీష్ ‘ ప్రేమ కాదంట’ అనే చిత్రాన్ని ప్రకటించాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చి ఏడాదికి పైనే గడిచిపోతోంది. ఇంతవరకు కొత్త అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ పెళ్లి వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. త్వరలో అల్లు శిరీష్ టాలీవుడ్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. ఆమె హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ అని కొందరు చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
అయితే అల్లు శిరీష్ కొత్త సినిమా ‘ప్రేమ కాదంట’ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోందని.. అందుకే ఈ పుకార్లకు కొందరు తెరతీశారని తెలుస్తోంది. ఈ మూవీలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయట. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా అల్లు శిరీష్ ప్రేమలో పడ్డాడని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే నిజంగా అను ఇమ్మాన్యుయేల్‌కు అల్లు ఇంటి కోడలిగా వెళ్లే అర్హత ఉందా అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్ తనదైన నటనతో మెప్పించి వరుసగా సినిమా అవకాశాలు సాధించింది. పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమాలోనూ కనిపించింది. అయితే ఈ సినిమా పరాజయం కావడంతో అనూకి పెద్దగా అవకాశాలు రాలేదు. కోలీవుడ్‌లోనూ విశాల్ లాంటి స్టార్ల పక్కన నటించినా ఆమె ఫేట్ మారలేదు. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్‌తో చేస్తున్న సినిమాపై అను ఇమ్మాన్యుయేల్ భారీ ఆశలు పెట్టుకుంది.