
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ మరో హీరోకు లేదు. పవన్ సినిమా విడుదలైతే హడావిడి మాములుగా ఉండదు. అందుకే పవన్‌తో సినిమా చేయాలని దర్శకులు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే పవన్ ఒకవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాల కారణంగా లిమిటెడ్‌గానే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రెండు, మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్ సింగ్, సముద్రఖనితో వినోదయ సీతమ్ సినిమాలు చేయాల్సి ఉంది. ఇప్పుడు మరో సినిమాను కూడా పవన్ అంగీకరించాడు. రన్ రాజా రన్, సాహో సినిమాలను తెరకెక్కించిన యువ దర్శకుడు సుజిత్‌తో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి డీవీవీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆర్.ఆర్.ఆర్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత డీవీవీ సంస్థ నిర్మించబోయే సినిమా ఇదే కావడం విశేషం.
అయితే ఈ సినిమా గురించి యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా ప్రస్తావించాడు. సుజిత్, పవన్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రభాస్ ఆకాంక్షించాడు. ఈ మేరకు ఈ సినిమా టీమ్‌ను ప్రభాస్ ప్రత్యేకంగా విష్ చేశాడు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడుగా మారిన సుజీత్ ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో సాహో లాంటి సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. కానీ ఆ సినిమా ద్వారా ఆయన అనుకున్న ఫలితం అయితే సాధించలేకపోయాడు. కలెక్షన్స్ పరంగా సినిమా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కానీ తెలుగు ప్రేక్షకులను సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. హిందీలో ప్రేక్షకులను కొంతమేర ఈ సినిమా ఆకట్టుకోవడంతో ఆ మేర కలెక్షన్లు వచ్చాయి. సాహో సినిమా తర్వాత సుజిత్ గాడ్ ఫాదర్ సినిమా డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ సుజిత్ చేసిన డీటైలింగ్ నచ్చకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి అతడిని పక్కన పెట్టారు. గాడ్ ఫాదర్ సినిమాను దర్శకత్వం చేసే అవకాశం మోహన్ రాజా చేతిలో పెట్టారు.
అన్న మెగాస్టార్‌ను మెప్పించలేకపోయిన సుజిత్ ఆయన తమ్ముడు పవర్‌స్టార్‌కు మాత్రం నచ్చేశాడు. ఆయన్ను మెప్పించేలా కథను చెప్పాడు. దీంతో పవర్ స్టార్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్‌కు సుజిత్ ఒక కథ చెప్పాడని దానికి బాగా ఇంప్రెస్ అవడంతో ఏకంగా లంచ్‌కు కూడా పవన్ కళ్యాణ్ పిలిచాడని ప్రచారం జరిగింది. అయితే అనేక ప్రచారాల్లో ఇది కూడా ఒక భాగమేనని అందరూ భావించారు. ఎట్టకేలకు అది నిజమేనని చెబుతూ డివివి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఓ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి, బ్యాక్ డ్రాప్ వరకు చాలా విషయాలను సుజిత్ తెలివిగా రివీల్ చేశాడు. ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టర్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరోది డాన్ రోల్. ‘They Call Him #OG’ అని పోస్టర్ మీద ఒక కాప్షన్ ఇచ్చారు కదా! అందులో OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అన్నమాట. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ నీడను గన్ రూపంలో డిజైన్ చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ ఆ విధంగా రివీల్ చేశారు. జపాన్ నేపథ్యంలో చిత్రకథ ఉంటుందని సమాచారం.