
యంగ్ హీరోల్లో నితిన్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతడు సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. అనంతరం వీవీ వినాయక్ తెరకెక్కించిన దిల్ సినిమాతో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అక్కడి నుంచి నితిన్ స్టార్ హీరో అయిపోయాడు. అయితే ఓ దశలో వరుస పరాజయాలు ఎదురైనా నితిన్ అధైర్యపడకుండా ముందుకెళ్లాడు. ఎట్టకేలకు ఇష్క్ సినిమా మరోసారి నితిన్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ లాంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను రాజశేఖర్‌రెడ్డి అనే యువ దర్శకుడు తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఎమ్‌ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఓ వ్యక్తి ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి కొన్ని వర్గాలను కించపరిచేలా కామెంట్లు చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారి నితిన్‌ను చిక్కుల్లో పడేసింది.
2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలిచిన తర్వాత ఎమ్‌ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో కొన్ని ట్వీట్లు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కమ్మ కులాన్ని, కాపు కులాన్ని తిట్టినట్లు ఆ ట్వీట్లు ఉన్నాయి. దీంతో ఆ రెండు వర్గాలకు చెందిన అభిమానులు నితిన్ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిని అన్నమాట నిజమే కానీ తాను వేరే కులాలను కించపరిచే విధంగా ఎలాంటి కామెంట్లు చేయలేదని దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి సోషల్ మీడియా వేదిక క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడి ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన నితిన్ కూడా ఇలా ఫేక్ ట్వీట్లను వైరల్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. ఇది చాలా దారుణమైన విషయం అని తాను ఖండిస్తున్నానని నితిన్ పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులే చాలా మంది ఈ ఫేక్ ట్వీట్లను వైరల్ చేస్తున్నారని.. తన అభిమాన హీరో ఫ్యాన్స్ ఇలా చేస్తారని తాను అనుకోలేదని.. ఈ విషయం తెలిసి తనకు చాలా బాధ కలిగిందని నితిన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు ఈ విషయం ఇలాగే వదిలేస్తే ఇబ్బంది అని భావించిన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్‌రెడ్డి మాచర్ల నియోజకవర్గం సినిమా నిర్మాత నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పేరు మీద ఫేక్ ట్వీట్లు చేసి తప్పుగా పోస్ట్ చేస్తున్నారని ఆరోపించాడు. ఎంఎస్ రాజశేఖర్‌రెడ్డి గతంలో పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు. మాచర్ల నియోజకవర్గం చిత్రంతోనే డెబ్యూ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. అయితే తొలి సినిమాకే కులాల విషయంలో వివాదం ఎదుర్కొంటున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కృతి శెట్టి, కేథరిన్ నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది. ఆగస్టు 12న మాచర్ల నియోజకవర్గం మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ‘రంగ్ దే’, ‘మ్యాస్ట్రో’ సినిమాలతో మెప్పించిన నితిన్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో వేచి చూడాలి.