
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్నారు. జనవాణి కార్యక్రమం కోసం ఆయన విశాఖ వెళ్లారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు జనసేన ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇప్పటికే పలు చోట్ల ఏర్పాట్లు చేసిన జనవాణికి భారీగా స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖలోనూ జనవాణి కార్యక్రమానికి రూపకల్పన చేయగా ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో పవన్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పవన్ పర్యటనను అడ్డుకోవడంతో జనసైనికులు అభ్యంతరం తెలిపారు. దీంతో అడిగేవాళ్లు లేరన్న తరహాలో అధికార పార్టీ వ్యవహరించడం సరికాదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చూస్తే అధికార పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని పవన్ అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తన పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తాను విశాఖలోనే ఉంటానని స్పష్టం చేశారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనలో మంత్రులపై దాడి జరిగిందని పలువురు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై ఆయన పవన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వందలమంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందని జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతల అరెస్టులు తదితర అంశాలపైనా చంద్రబాబుకు పవన్ వివరించారు. మరోవైపు ఆదివారం రాత్రి కూడా పవన్ కళ్యాణ్ విశాఖలో ఉండనున్నారు. నోవాటెల్ హోటల్‌లోనే ఆయన ఉండటంతో ఆ ప్రాంతానికి అభిమానులు పెద్దఎత్తున తరలివెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జనసైనికులను చెదరగొట్టి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. దీంతో పవన్ పూర్తి హోటల్ గదికే పరిమితం అయ్యారు.
హోటల్‌లోనే ఉన్న పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్కే బీచ్‌లో చల్లని సాయంత్రం వాకింగ్ చేయాలని ఉందని.. అందుకు పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదో అంటూ ట్వీట్ చేశారు. అటు తన సోదరుడు పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి సోమవారం విశాఖకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. తన సోదరుడిపై జగన్ ప్రభుత్వ తీరును, పోలీసులు వ్యవహరించిన తీరును మెగాస్టార్ పూర్తిగా ఖండించారు. ముఖ్యంగా పవన్ పర్యటనను పోలీసులు అడ్డుకున్న తీరుపై చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్వయంగా ఆయన విశాఖ వెళ్లి సోదరుడికి మద్దతు తెలపనున్నట్లు మెగాస్టార్ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే విశాఖలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని నగరంలో ర్యాలీలు, బహిరంగ సభలు, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదని పోలీసులు పవన్ కళ్యాణ్‌కు ఆదివారం నోటీసులు అందజేశారు.