
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వీర సింహా రెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్యని డ్యూయల్ రోల్ లో ప్రెజెంట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీక్షించబోతున్నట్లు తెలుస్తోంది. వీర సింహారెడ్డి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ టీమ్.. ఇప్పుడు జనసేన అధినేత కోసం బాలయ్య సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
నిజానికి టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకృష్ణ, పవన్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకప్పుడు రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా.. తర్వాతి రోజుల్లో స్నేహబంధం కొనసాగిస్తూ వచ్చారు. ఇటీవల కాలంలో ఆ బంధం మరింత బలపడినట్లు కనిపిస్తోంది. గత నెలలో హైదరాబాద్ లో వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ సెట్స్‌ను సందర్శించడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణతో మాట్లాడి సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నాడు పవన్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లారు. వీర సింహారెడ్డితో వీరమల్లు భేటీ అవ్వడం అప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇదే క్రమంలో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్-2లో పవన్ కళ్యాణ్ పాల్గొని సందడి చేశాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. ఆహా ఓటీటీలో త్వరలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
వాస్తవానికి మెగా నందమూరి హీరోల మధ్య ఎన్నో ఏళ్లుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో తరచుగా ఓ రేంజ్ లో గొడవలు జరుగుతుండటం మనం చూస్తుంటాం. అలాంటిది ఇప్పుడు పవన్ – బాలయ్య ఒకరి పట్ల మరొకరు గౌరవాభిమానాలు చూపిస్తుండటం వారి దృష్టిని ఆకర్షించింది. సినీ, రాజకీయ వర్గాల్లో ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే అందరూ NBK – PSPK అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో సినీ రాజకీయంతో పాటు వ్యక్తిగత అంశాలను కూడా ఈ షోలో ప్రస్తావించారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు బాలయ్య నటించిన వీరసింహా రెడ్డి చిత్రాన్ని పవన్ కోసం స్పెషల్ గా ప్రదర్శించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో భిన్న ధృవాలైన విభిన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు లెగసీ ఉన్న ఈ ఇద్దరు హీరోల మధ్య స్నేహం కుదరడం మాములు విషయం కాదు. ఇది ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడానికి దోహదం చేస్తుందని చెప్పాలి.