
టాలీవుడ్‌లో నటీనటులు ఎంతో మంది ఉన్నా స్నేహితులు కొంతమందే ఉంటారు. అలాంటి స్నేహితుల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, అలీ కూడా ఉంటారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. తొలిప్రేమ సినిమా నాటి నుంచి దాదాపు పవన్ నటించిన ప్రతి సినిమాలో అలీ ఉంటాడు. తమ్ముడు, బద్రి, ఖుషి, అత్తారింటికి దారేది సినిమాల్లో పవన్, అలీ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది. అయితే కొంతకాలంగా పవన్, అలీ దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కొనసాగుతుండగా అలీ మాత్రం అధికార పార్టీ వైసీపీలో కొనసాగుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం నడుస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. అలీ రాజకీయాల్లో కొనసాగుతున్నా టీవీ షోలలో కూడా పాల్గొంటున్నాడు. ఈటీవీలో అలీతో సరదాగా కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖులను అలీ ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయ్యాడు. ఎస్పీ బాలుతో అలీ చేసిన ఇంటర్వ్యూ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
ప్రస్తుతం అలీతో సరదాగా కార్యక్రమం ముగింపుకు చేరుకుంది. చివరి ఎపిసోడ్‌కు ప్రముఖ యాంకర్ సుమ ముఖ్య అతిథిగా హాజరైంది. కానీ ఈ షోలో అలీ సుమను కాకుండా అలీని సుమ ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో ఎందుకు గ్యాప్ వచ్చిందని అలీని సుమ ప్రశ్నించింది. ఈ మేరకు అలీ తన మనసులోని విషయాలను పంచుకున్నాడు. పవన్‌తో తనకు గ్యాప్ రాలేదని.. క్రియేట్ చేశారని సంచలన ఆరోపణలు చేశాడు. అయితే అలీ ఏం చెప్పాడో పూర్తిగా తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఈనెల 19న ప్రసారం కానుంది. ఇంకా ఈ షోలో తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, తన తొలి సినిమా పారితోషికం వంటి వివరాలను కూడా అలీ వివరించాడు.
తన పెళ్లికి ముందు తన లవ్ స్టోరీని కూడా సుమతో అలీ పంచుకున్నాడు. పెళ్లికి ముందు ఏవైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అని సుమ ప్రశ్నించగా, అలీ సిగ్గులు మొగ్గేశాడు. ఓ రోజు తమ పక్కింటి అమ్మాయి వర్షంలో తడుస్తూ వస్తుందని, ఆమెని చూసిన అలీ తన చెల్లితో గొడుగు ఇచ్చి పంపించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమె వర్షం లేకపోయినా ఆ గొడుగు పట్టుకుని తన ఇంటి ముందు నుంచి వెళ్లేదని వివరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది షో నిర్వాహకులు సస్పెన్స్‌లో పెట్టారు. మొత్తానికి వివాదాలు, ఎఫైర్లతో ప్రోమోను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అయితే 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో అలీ వైసీపీ పార్టీలో చేరాడు. పవన్ స్నేహితుడిగా ఉండి అతడితో ఉండకుండా వేరే పార్టీలోకి వెళ్లడంతో పవన్ కూడా పలు కామెంట్లు చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన అలీ కూడా పవన్‌పై కొన్ని కామెంట్లు చేశాడు. ఏపీ అభివృద్ధి విషయంలోనూ పవన్ వ్యాఖ్యలను ఆయన ఖండించాడు. ఈ నేపథ్యంలో వీరు చేసిన కామెంట్లు ఇద్దరి మధ్య గ్యాప్‌ని పెంచుతూ వచ్చాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అలీ వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.