
ఇటీవల ఏపీలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికార పార్టీ వైసీపీ అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ముందే ప్రకటించినా వైసీపీ నేతలు విశాఖ గర్జన పేరుతో ఆయన పర్యటనను అడ్డుకున్నారు. అంతేకాకుండా విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడులు చేశారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్‌ను నోవోటెల్ హోటల్ గదికే పరిమితం చేశారు. మరోవైపు పలువురు జనసేన కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. తన అభిమాన నాయకుడిని నిర్బంధించారని తెలిసి లక్షల సంఖ్యలో జనసేన కార్యకర్తలు నోవోటెల్ హోటల్ వద్దకు చేరుకుని పవన్ కళ్యాణ్‌కు సంఘీభావం తెలిపారు. అక్కడ కూడా పోలీసులు అభిమానులను అడ్డుకుని నానా హంగామా సృష్టించారు. అయినా పవన్ కళ్యాణ్ వేటికీ బెదరలేదు. హోటల్ గది నుంచే అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. ఎప్పటికప్పుడు హోటల్‌లో జరుగుతున్న పరిణామాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అటు పవన్ కళ్యాణ్ పట్ల విశాఖలో అధికార పార్టీ వ్యవహరించిన తీరును పలు రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. జనసేన మిత్రపక్షమైన బీజేపీ నేతలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ఖండించారు. పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై ఆయన పవన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వందలమంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని ప్రశ్నించారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందని జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు. మరోవైపు తనను పదే పదే ప్యాకేజీ స్టార్ అని.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తనపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి లెక్కను తాను చెప్తానని తెలిపారు. గత 8 ఏళ్లలో తాను ఆరు సినిమాలు చేశానని.. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు సంపాదించానని.. . రూ.33.37 కోట్ల ఇంకమ్‌ట్యాక్స్ కట్టానని పవన్ వివరించారు.
ఈ నేపథ్యంలో విజయవాడలో పవన్ కళ్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే వ్యక్తిగతంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణ పరిస్థితులు చూడలేదని, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. వైసీపీ అంత నీచమైన పార్టీని జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతానని తెలిపారు. ఈ మేరకు అన్ని పార్టీలు జనసేనకు మద్దతు తెలుపుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తన సోదరుడి పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అటు గాడ్ ఫాదర్ సినిమా సమయంలోనూ తన సోదరుడిపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల నుండి దూరంగా రావడం పవన్‌కు కలిసొస్తుందని చెప్పుకొచ్చారు. పవన్ అంకితభావం కలిగిన నాయకుడు అని.. అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమన్నారు. ఆ అవకాశం ప్రజలు పవన్‌కు ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానేమో అంటూ చిరు వివరించారు.