
సినీ ఇండస్ట్రీలో విలన్‌లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలు అయిన వాళ్లు ఉన్నారు. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రలు పోషించిన వాళ్లు ఉన్నారు. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్‌గా విజయవంతమై మళ్లీ హీరోగా నిలదొక్కుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది గోపీచంద్ మాత్రమే. ప్రముఖ దర్శకుడైన తండ్రి టి. కృష్ణ బాటలో కాకుండా నటుడుగా మారిన గోపీచంద్ కెరీర్ ఇప్పుడు కష్టాల కడలిలో ఉంది. ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ3 బ్యానర్లపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్ అంటూ ప్రమోషన్‌లలో ఊదరగొట్టారు. కానీ అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
అయితే తొలిరోజే పక్కా కమర్షియల్ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ బోరింగ్‌గా ఉందని మౌత్ టాక్ స్పెడ్ కావడంతో కలెక్షన్‌లు తొలి రోజు నుంచే డౌన్ అవుతూ వచ్చాయి. దీంతో ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ.12 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ వంటి ప్రముఖులు నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి రావడంతో హిట్ అవ్వడం పక్కా అని అందరూ ఊహించారు. కానీ గోపీచంద్‌కు మాత్రం మరో పరాజయాన్ని మిగిల్చింది. పక్కా కమర్షియల్ మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతలు లాభపడినా బయ్యర్లకు మాత్రమే నష్టాలు వస్తాయని పక్కాగా తెలుస్తోంది. ఈ సినిమాకు ముందు గోపీచంద్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండటంతో నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 17 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
దర్శకుడు మారుతి గత చిత్రాలు భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి సినిమాలకు టీవీలలో ఇప్పటికీ మంచి రేటింగులు వస్తుంటాయి. కాబట్టి ఈ సినిమాను శాటిలైట్ సంస్థలు పోటీ పడి కొన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే నిర్మాతలు సేఫ్ అయినా….. థియేటర్ వైపు నుంచి చూస్తే ఈ కాంబోకు రావాల్సిన రెస్పాన్స్ మాత్రం రాలేదు. మంచి రోజులొచ్చాయి మూవీతో గతంలో ఫ్లాప్ చవిచూసిన మారుతికి ఇప్పుడీ పక్కా కమర్షియల్ మూవీ కూడా వర్కవుట్ కాలేదు. మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న పక్కా కమర్షియల్ కూడా నిరాశపరచటంతో హీరో గోపీచంద్ ఆశలన్నీ ఇప్పుడు రాబోయే శ్రీవాస్ సినిమాపైనే ఉన్నాయి. 2014లో వచ్చిన లౌక్యం తర్వాత ఆ స్థాయి హిట్ మళ్ళీ గోపీకి దక్కలేదు. మధ్యలో జిల్, సీటీమార్ వంటి యావరేజ్ సినిమాలు ఉన్నా మిగిలినవి అన్నీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ లేకుంటే గోపీచంద్‌ను పలకరించే వారు కూడా ఉండరన్నది నగ్నసత్యం. కథల ఎంపికలో గోపీచంద్ వరుసగా తప్పటడుగులు వేస్తున్నాడని వరుసగా విడుదలైన సినిమాలను చూస్తే అర్ధమవుతుంది.