
గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. విలక్షణ సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి పక్కా కమర్షియల్ సినిమా చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ యూవీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కాలంలో హీరో గోపీచంద్‌కు సరైన హిట్ పడలేదు. దీంతో అతడు పక్కా కమర్షియల్ సినిమాపై గంపెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైనట్లు తొలిరోజే తేలిపోయింది. ప్రచారం కారణంగా తొలిరోజు సంతృప్తికరంగానే వసూళ్లు సాధించింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.6.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. అయితే మూడురోజుల వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి.
పక్కా కమర్షియల్ మూవీ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్‌లను పరిశీలిస్తే రూ.10 కోట్లు మాత్రమే సాధించింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్ల వరకు జరిగినట్లు టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. పెద్ద బ్యానర్లు ఈ సినిమాను నిర్మించడంతో బయ్యర్లు భారీ రేట్లకు ఈ మూవీని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రాలో రూ. 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను పక్కా కమర్షియల్ సినిమా చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుని చూస్తే ఈ సినిమాకు రూ. 17.50 కోట్ల ముందస్తు బిజినెస్ జరిగిందన్నారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలుసుకుని రూ. 50 లక్షలు, ఓవర్ సీస్ రూ. 1.20 కోట్లు బిజినెస్ జరిగిందని వెల్లడించారు. వరల్డ్ వైడ్‌గా పక్కా కమర్షియల్ చిత్రం రూ. 19.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుందని తెలిపారు. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ చిత్రం రూ. 20 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందన్నారు. అయితే తొలి వీకెండ్‌లో సగం మాత్రమే వసూలు కావడంతో మిగతా రోజుల్లో రూ.10 కోట్లు రాబట్టడం మాములు విషయం కాదని తెలుస్తోంది.
‘జిల్’, ఆక్సిజన్ మూవీస్ తర్వాత గోపీచంద్, రాశీ ఖన్నా జోడీగా మరోసారి పక్కా కమర్షియల్ మూవీలో కనిపించారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించాడు. గత ఏడాది ఆరడగుల బుల్లెట్ సినిమా తర్వాత గోపీచంద్ వెండితెరపై కనిపించలేదు. ఈ నేపథ్యంలో గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా చేయడం అందరిలోనూ ఆసక్తి రేపింది. ఓ వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి హీరో పక్కా కమర్షియల్‌గా మారి అన్యాయానికి కొమ్ము కాయడం ఈ సినిమాలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం ఫర్వాలేదనిపించేలా ఉంది. ఈ చిత్రానికి కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు. సాధారణంగా మారుతి సినిమాల్లో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. సరదాగా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు ఆయన సినిమాలను చూడటానికి ఇష్టపడతారు. అయితే పక్కా కమర్షియల్ మూవీలో కామెడీ కూడా అంతగా లేదని సినిమా చూసిన వాళ్లు అంటున్నారు. దీంతో తొలిరోజే ఈ సినిమా డివైడ్ టాక్ సంపాదించుకోవడంతో రెండో రోజు నుంచే వసూళ్లు దారుణంగా పడిపోయాయి.