
అక్కినేని నాగార్జునకు టాలీవుడ్‌లో మన్మథుడిగా పేరుంది. ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తూ అనేక విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. తన బ్యానరుపై అక్కినేని హీరోలతోనే కాకుండా బయటి హీరోలతోనూ ఆయన సినిమాలు నిర్మించారు. ఇప్పుడు ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య లవర్ బాయ్‌గా పలు సినిమాల్లో నటించి తనకంటూ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగానూ రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మేరకు చైతూ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానరులోనే సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అయితే చైతూ నిర్మాతగా నిర్మించే తొలి సినిమాలో మెగా హీరో నటించనున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు యంగ్ హీరోలంతా నిర్మాణం వైపు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పెద్ద హీరోలందరికీ సొంత ప్రొడక్షన్ హౌస్‌లు ఉన్నాయి. మెగా కుటుంబంలో గీతా ఆర్ట్స్‌తో పాటు కొణిదెల ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ వంటి బ్యానర్లు ఉన్నాయి. నందమూరి వంశానికి సంబంధించి రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్, ఎన్‌బీకే ప్రొడక్షన్స్ వంటి బ్యానర్లు ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీలో అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఉంది. మహేష్‌బాబుకు ఏఎంబీ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నాగచైతన్య కూడా వీరి సరసన చేరనున్నాడు. చైతూ తొలిసారిగా మెగా హీరోతో కలిసి సినిమాను తీయబోతున్నాడు. దీంతో మెగా అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ గురించి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చైతూ నిర్మించనున్న తొలి సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సహ నిర్మాతగా అక్కినేని అఖిల్ వ్యవహరించనున్నాడు.
ప్రస్తుతం నాగచైతన్య హీరోగా థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. విభిన్నమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓ యువకుడి జీవితంలోని భిన్న దశలను ఆవిష్కరిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. జూలై 8న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇందులో నాగచైతన్య పాత్ర డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుందని సమాచారం. నాలుగైదు లుక్స్ లో అతడు కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ సినిమాలో రాశీఖన్నా, మాళవికానాయర్, అవికాగోర్ కథానాయికలుగా నటిస్తున్నారు. బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. గతంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘మనం’ సినిమాలో నాగచైతన్య నటించాడు. కొత్త తరహా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. మనం తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్‌తోనే మరోసారి చైతూ పనిచేయబోతున్నాడు. అయితే అది సినిమా కాదు.. వెబ్‌సిరీస్. దూత అనే వెబ్ సిరీస్‌లో చైతూ నటించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్‌తోనే చైతూ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.