
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌పై ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిత్యం విమర్శలు చేస్తోంది. అదే సమయంలో ఆయన అన్నయ్య చిరంజీవితో మాత్రం సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. తాజాగా వైసీపీ నేతలతో తన బంధంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మీద వచ్చిన విమర్శలు, ఆయనకు ఎదురయ్యే తిట్ల గురించి చిరంజీవిని ప్రశ్నించగా.. అవన్నీ వింటే బాధ కలుగుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ తన బిడ్డ లాంటి వాడని.. అతడిని తానే ఎత్తుకుని పెంచానని అన్నారు. ఎలాంటి స్వార్ధం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పవన్‌కు డబ్బు యావ, పదవి కాంక్ష లేవన్నారు. కానీ పవన్‌కు తిట్టినవాళ్లు తన దగ్గరకు వస్తారని.. అలాంటి వాళ్లతో మాట్లాడుతుంటే తనకు చాలా బాధగా ఉంటుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్‌కు మొన్నటివరకు సొంతిల్లు కూడా లేదని.. సమయానికి పవన్ అన్నం కూడా సరిగ్గా తినడని.. బట్టలు కూడా సరైనవి వేసుకోడని చిరంజీవి అన్నారు. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తాయని చిరు చెప్పుకొచ్చారు. చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి రాజకీయాలనే మురికి కూపంలోకి పవన్ కళ్యాణ్ వెళ్లాడని.. మురికిని తీసేయాలనుకునేవారికి కొంత మురికి అంటడం మామూలే అని చిరంజీవి చెప్పారు. స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ పవన్‌ను తిట్టినవాళ్లు తన దగ్గరకు వచ్చి పెళ్లిళ్లు, పేరంటాలకు రమ్మని పిలుస్తుంటారని.. తమ్ముడిని అన్నేసి మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి రావడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అని వైసీపీ నేతలను ఉద్దేశించి చిరంజీవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఏపీ రాజకీయాల్లో పవన్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పవన్‌ను దత్త పుత్రుడు అని వైసీపీ నేతలు నిత్యం విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ను విమర్శించే వారిలో మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి జోగి రమేష్, మంత్రి అంబటి రాంబాబు, మంత్రి రోజా ముందుంటారు. అటు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించిన చిరంజీవి ఈ ఏడాది మూడు, నాలుగు సినిమాలతో రెడీగా ఉన్నారు. ఇందులో చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లలో చిరు పాల్గొంటున్నాడు. చిరంజీవి కెరీర్‌లో 154వ చిత్రంగా వస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రానికి యువ దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే అతడి ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో వాల్తేరు వీరయ్యపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి.