
టాలీవుడ్‌లో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ జాబితాలో సూపర్‌స్టార్ కృష్ణ తనయుడు మహేష్‌బాబు కూడా ఉన్నాడు. తన తండ్రి హీరోగా నటించే సమయంలోనే మహేష్‌బాబు చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి సూపర్ హిట్‌లను సొంతం చేసుకున్నాడు. బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, బాలచంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం, అన్నాతమ్ముడు వంటి సినిమాల్లో మహేష్ చిన్నతనంలో నటించాడు. అనంతరం 1999లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి వంటి సినిమాలతో స్టార్ హీరో స్టేటస్ సంపాదించి టాలీవుడ్‌లో అగ్రహీరోగా మహేష్‌బాబు దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మహేష్‌బాబు పాన్ ఇండియా సినిమాలను కూడా తీస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్, రాజమౌళి వంటి స్టార్ దర్శకులతో మహేష్ సినిమాలు చేస్తున్నాడు.
అయితే మహేష్ కాకుండా మహేష్ సినిమాలో నటించిన ఓ బాలనటుడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మహేష్‌బాబు నటించిన నాని సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్.జె.సూర్య ప్రయోగాత్మకంగా నాని సినిమాను తెరకెక్కించాడు. నాని సినిమాలో మహేష్ ఉదయం పూట బాలుడిగా కనిపిస్తాడు. రాత్రిపూట పెద్దవాడుగా మారిపోతాడు. మహేష్ కెరీర్‌లోనే ఇది ప్రయోగాత్మక చిత్రం. అయితే ఈ సినిమా మహేష్ అభిమానులకు రుచించలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే మహేష్ ప్రయోగాత్మక సినిమాలు చేస్తాడని నాని సినిమాతో నిరూపితమైంది. నాని సినిమాలో మహేష్ స్నేహితుడిగా నటించిన ఓ బుడ్డోడు ఇప్పుడు తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఎవరో కాదు గల్లా అశోక్. మహేష్ బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు. గల్లా అశోక్ హీరోగా ‘హీరో’ అనే సినిమా ఈ ఏడాది విడుదలైంది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది. అయితే కోవిడ్ కారణంగా ఎక్కువ రోజులు థియేటర్లలో నిలవలేకపోయింది.
గల్లా అశోక్ హీరోగా నటించిన హీరో మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అశోక్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కథాంశంతో శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించగా గల్లా అరుణకుమారి సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ మూవీని నిర్మించారు. ఒక సామాన్య వ్యక్తి ఇండస్ట్రీలో హీరో కావాలనుకుంటారు. ఈ సందర్బంగా తన ప్రయాణంలో ఎదురైన కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడు. చివరకు అనుకున్నది సాధించారా లేదా అనేదే ‘హీరో’ మూవీ స్టోరీ. ఈ సినిమాలో గల్లా అశోక్ తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ నటించారు. మిగతా పాత్రల్లో జగపతి బాబు నటించారు. తొలుత ఈ సినిమాలో హీరోగా నితిన్‌ను అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల నితిన్ ఈ ప్రాజెక్టును అంగీకరించకపోవడంతో ఈ సినిమా అవకాశం గల్లా అశోక్ ఖాతాలోకి చేరింది.