
అక్కినేని నాగార్జున తనయుడిగా నాగచైతన్య సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. దిల్ రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఏ మాయ చేశావే అంటూ ప్రేక్షకులను మైమరిపించాడు. చైతూకు కూల్ యాక్టర్‌గా పేరుంది. అతడు ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లడు. సమంతతో విడాకుల విషయంలో కూడా అందరూ సమంతనే వేలెత్తి చూపించారు తప్ప చైతూ గురించి ఎక్కడా విమర్శలు రాకపోవడం అతడి వ్యక్తిత్వాన్ని చాటుతోంది. ఇండస్ట్రీలో చైతూ ప్రవర్తనపై చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. అయితే నాగచైతన్య వ్యక్తిత్వానికి ఆమె కన్నతల్లి కారణమని ఇటీవల అతడి పిన్ని అమల సంచలన విషయాన్ని బయటపెట్టింది. నాగార్జున తొలి భార్య పేరు దగ్గుబాటి లక్ష్మీ. వీళ్లిద్దరికీ నాగచైతన్య పుట్టాడు. నాగార్జున తన తొలి భార్యతో విడిపోయిన తర్వాత చైతూ ఎక్కువగా తల్లి దగ్గరే పెరిగాడు.
తొలి భార్యతో విడాకుల అనంతరం 1992లో నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమల నాగచైతన్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమె తన తనయుడు అఖిల్ గురించి తప్ప ఎప్పుడూ చైతూ గురించి బహిరంగంగా కామెంట్ చేయలేదు. నాగచైతన్యను తాను పెంచలేదని.. తన పెళ్లి తర్వాత అతడు ఎక్కువగా చెన్నైలోనే ఉండేవాడని అమల తెలిపింది. సెలవుల్లో మాత్రం హైదరాబాద్ వచ్చే వాడని వివరించింది. చైతూను వాళ్ల అమ్మే పెంచిందని.. వాళ్ల అమ్మ లక్ష్మీ గారు చైతన్యను ఎంతో పద్ధతిగా పెంచారని కొనియాడింది. చైతూ హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువగా తండ్రితోనే గడిపేవాడు అని అమల గుర్తుచేసుకుంది. నాగ్, చైతూ కలిస్తే ఇద్దరూ అనేక విషయాలపై ముచ్చట్లు పెట్టుకునేవారని చెప్పింది.
తన కొడుకు అఖిల్ చిన్నతనంలో అన్నయ్య వచ్చాడంటూ నాగ చైతన్య వెంటే తిరుగుతూ ఆడుకునే వాడని అమల చెప్పింది. చిన్న తనంలో అఖిల్ చైతూకు ఓ తోకలా ఉండే వాడని… ఎప్పుడు చూసినా అన్నా అన్నా అంటూ చైతూ వెంట పడుతూ కనిపించేవాడని వివరించింది. చైతూ, అఖిల్ ఇద్దరూ ఆడుకునే సమయాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేసేదానిని అంటూ అమల చెప్పుకొచ్చింది. నాగచైతన్య హైదరాబాద్ వస్తే అఖిల్‌కు తాను కూడా గుర్తుకు వచ్చేదానిని కాదని.. అంతగా అఖిల్ చైతూతో ఎంజాయ్ చేసేవాడు అంటూ చెప్పింది. అయితే ఇద్దరిలో అఖిల్ హైపర్ యాక్టివ్ అని.. అతడు అల్లరి చేస్తూ ఉండేవాడు అని.. నాగచైతన్య మాత్రం సైలెంట్‌గా ఉంటాడు అని అమల వివరించింది. కాగా చైతన్య, అఖిల్ ప్రస్తుతం తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అఖిల్ ఏజెంట్‌గా, చైతూ థాంక్యూ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు నాగచైతన్య అమెజాన్ ప్రైమ్‌లో ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. సమంతతో విడాకుల అనంతరం చైతూ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరో హోదా సంపాదించేందుకు తెగ కష్టపడుతున్నాడు.