
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాల విషయంలో జోరు మీద ఉంది. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలతో మరికొన్ని సినిమాలకు కూడా సమంత సైన్ చేసింది. వీటిలో యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. సై ఫై థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో సమంత మహిళా ఖైదీగా నటించనుంది. ఈ సినిమా కథనం ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ప్రస్తుతం మార్పులు జరుగుతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న విధంగా ఈ మూవీని ఆగస్టు 12న విడుదల చేయడం లేదని తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం నాగచైతన్య, అఖిల్ సినిమాలే అని అందరూ భావిస్తున్నారు.
అక్కినేని నాగచైతన్య నటించిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దాను ఆగస్టు 11న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అటు సమంత యశోద మూవీని ఆగస్టు 12న, అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీని ఆగస్టు 13న ప్లాన్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఏజెంట్ సినిమా నిర్మాణం జాప్యం కావడంతో ఆ సినిమా వాయిదా పడింది. దీంతో బరిలో ఉన్నది నాగచైతన్య, సమంత సినిమాలే. దీంతో మాజీ భార్యాభర్తలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతారని అందరూ భావించారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు యశోద సినిమాను కూడా వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. తాజాగా సమంత యశోద రిలీజ్ కోసం కొత్త డేట్ కోసం వెతుకుతున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఎప్పుడో జరిగింది. కానీ ఇది ఇప్పటివరకు ఎటువంటి హైప్ క్రియేట్ కాలేదు. ఇలాంటి హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలకు భారీ ప్రమోషన్లు చేయడం, హైప్ తీసుకురావడం ఎంతో అవసరం. కానీ ఈ మూవీపై తగినంత బజ్ లేకపోవడంతో మేకర్స్ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
అటు లాల్ సింగ్ చద్దా సినిమాలో అమీర్‌ఖాన్ తో కలిసి చైతూ తొలిసారిగా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా హిట్ కావడం చైతూ కెరీర్‌కు ఎంతో ముఖ్యం. అతడు నటించిన తెలుగు సినిమా థాంక్యూ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ జూలైలోనే విడుదల కానుంది. అయితే చైతూ, సమంత సినిమాలు ఒక్కరోజు తేడాలో వస్తాయని గతంలో ప్రచారం జరగడంతో ఈ ఇద్దరి సినిమాల్లో ఎవరి సినిమా పై చేయి సాధిస్తుందన్న ఆసక్తిని సినీ లవర్స్ చూపించారు. అయితే పోటీ విషయంలో సమంత సినిమానే వెనక్కు తగ్గినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి చైతూది బాలీవుడ్ మూవీ కావడంతో ఇక్కడ పెద్దగా పోటీ ఉండదు. కానీ ఎందుకో యశోద టీమ్ వెనక్కి తగ్గింది. యశోద సినిమాను హరి, హరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని, ఈ సినిమా ఆడియెన్స్‌ను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.